గ్రామాలలో సివిల్ రైట్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తాం

కరీంనగర్: గ్రామాలలో ప్రతి నెల 30వ తేదిన సివల్ రైట్స్ దినోత్సవాన్ని స్ధానిక అధికారులతో నిర్వహిస్తామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరేటు సమావేశ మందిరంలో జిల్లా స్ధాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సివిల్ రైట్స్ దినోత్సవ నిర్వహణకు ఒకరోజు ముందు టాం, టాం ద్వారా ప్రచారం చేయిస్తామని అన్నారు. గ్రామాలలో జరిగే ఈ కార్యక్రమం మండల స్ధాయి అధికారులను, పోలీసు అధికారులు పాల్గొని స్ధానిక సమస్యలను సంబంధించి పరిష్కరించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాల పై ఎస్పీ, ఎస్టి కమిటి సభ్యులు విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఇప్పటికే గత మార్చి మాసంలో సర్క్యలర్ పంపించడం జరిగిందని ఆమె తెలిపారు. ఎస్సీ, ఎస్టిలకు సంబంధించిన కేసులను సత్వరమే పూర్తి విచారణ చేసి చట్ట ప్రకారంగా చర్యలు చేపట్టాలని ఆమె పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశాలకు ముందే నివేదికలను సాంఘీక సంక్షేమ శాఖకు పంపించాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అట్రాసిటి, ఎస్సీ, ఎస్టిల వారిపై దాడులు, దౌర్జన్యాలకు సంబంధించిన కేసుల పై చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వివిధ పధకాల క్రింద అర్హులైన, ఎస్సీ, ఎస్టి లబ్దిదారులకు మంజూరైన భూములు, ఇండ్లు అన్యాక్రాంతం కాకుండా లబ్దిదారులకు చెందే విధంగా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్లాలని అన్నారు. కమిటి సభ్యులు మాట్లాడుతూ, అట్రాసిటి, తదితర కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం సాక్షులను బెదిరిస్తున్నారని, దోషుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టిలకు మంజూరు చేసిన భూములు ఇతర వర్గాల వారు సాగు చేస్తున్నారని, ఆధీనపర్చుకున్నారని సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్సందిస్తూ రెవిన్యూ డివిజనల్ అధికారులు వారి పరిధిలోని ఎస్సీ, ఎస్టిల భూములను పరిశీలించి సత్వరమే చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పి, జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక, సాంఘీక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యాదయ్య, జిల్లాలోని ఆర్టీఓలు, డిఎస్పిలు, సంఘాల కమిటి సభ్యులు జె.చంద్రయ్య, వి.శంకర్, ఎం. దుర్గాప్రసాద్, కుడిమెత్త సమయ్యదొర, వి.విజయ కుమార్, పెద్దెల్లి శేఖర్, గులాబిల మల్లారెడ్డి, అబ్దుల్ రహీం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *