గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు 75 శాతం సబ్సిడీ: మంత్రి తలసాని

రాష్ట్ర్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న 4 లక్షల కుటుంబాలకు 5 వేల కోట్ల రూపాయల వ్యయంతో 75 శాతం సబ్సిడీపై 84 లక్షల గొర్రెలను ప్రభుత్వం పంపిణీ చేయాలని గొర్రెలు, మత్స్యరంగాల భారీ అభివృద్ధి కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫారస్ చేసింది. పశుసంవర్ధక, మత్స్యశాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో 2వ సారి సమావేశమైంది. ఈ ఉపసంఘంలో ఆర్ధికశాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, భారీ నీటిపారుదలశాఖ మంత్రి శ్రీ టి.హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి, అటవీశాఖ మంత్రి శ్రీ జోగు రామన్న, రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావులు సభ్యులుగా ఉన్నారు. ఈ సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు మినహ మిగిలిన సభ్యులంతా హజరయ్యారు. ఈ సమావేశంలో సభ్యులు పలు అంశాలపై చర్చించి ముఖ్యమంత్రికి సమర్పించనున్న నివేదికలో సిఫారస్ చేయనున్నారు. రాష్ట్ర్రంలో 4 లక్షల యాదవ, కుర్మ కుటుంబాలు ఉండగా, ఇందులో 2 లక్షల కుటుంబాలకు ఈ సంవత్సరం 20+1 చొప్పున గొర్రెలను పంపిణీ చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారస్ చేసింది. మిగిలిన 2 లక్షల కుటుంబాలకు వచ్చే సంవత్సరం పంపిణీ చేయాలని సూచించింది. లబ్దిదారులు గొర్రెల పెంపకం సోసైటీలలో సభ్యత్వం కలిగి ఉండాలని సూచించారు. సొసైటీలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రస్తుత కో ఆపరేటివ్ చట్టం ప్రకారం విధివిధానాలను ప్రతి సొసైటీ విరివిగా పాటించాలన్నారు. వీటిని 75 శాతం సబ్సిడీపై ఇవ్వాలని, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు జరిపించడానికి దోహదపడే విధంగా పశుసంవర్ధకశాఖలో అవసరమైన మార్పులు చేయాలన్నారు. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ నిధుల నుండి గొర్రెలను కొనుగోలు చేసి పంపిణీ చేయాలన్నారు. రాష్ట్ర్రంలో లబ్దిదారులకు పంపిణీ చేయనున్న గొర్రెలను కర్నాటక, తమిళనాడు, మహరాష్ట్ర్ర, రాజస్ధాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్ర్రాల నుండి కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన ప్రాంతంలోనే గొర్రెలకు ఇన్సూరెన్స్ ట్యాగ్ (పోగు) వేయాలని సూచించారు. రీ సైక్లింగ్ కాకుండా చర్యలు చేపట్లాలన్నారు. కిలోల లెక్కన ధరను నిర్ణయించాలన్నారు. లబ్దిదారుల ఎంపిక సరైన మార్గదర్శకాలు రూపొందించిన అనంతరం రాష్ట్ర్రస్ధాయిలో టెండర్లకు పిలవాలన్నారు. టెండర్ ను దక్కించుకున్న వారే లబ్దిదారులకు గొర్రెలనె వారి వారి గ్రామాలకు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు.

ఒక్కొక్క యూనిట్ ధర లక్షా 25 వేల రూపాయలు. గొర్రెల రవాణా, ఇన్సూరెన్స్, గొర్రెల కొనుగోలు ధర కలుపుకొని ఉంటుందన్నారు. అసలు గొర్రెలు లేని వారికి పంపిణీలో మొదటి ప్రాధాన్యత కల్పించాలన్నారు. మత్స్యశాఖపై జరిగిన చర్చలో భాగంగా సభ్యత్వ నమోదులో మరియు ఇతర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం పలు సూచనలు చేసిందన్నారు. ఈ సమావేశంలో గొర్రెలు మేకల అభివృద్ధి అభివృద్ధి సమాఖ్య చైర్మన్ కన్నెబోయిన రాజయ్యయాదవ్, పశుసంవర్ధకశాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి సురేష్ చందా, మత్స్యశాఖ కమీషనర్ డాక్టర్ సువర్ణ, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మంజువాణిలు పాల్గొన్నారు.    

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *