
-కరీంనగర్ ఎంపీగా చేసినా వివక్ష చూపిస్తున్న కేసీఆర్
– టీఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న పోలీసులు
-కేంద్రం నుంచి పైసా సాధించలేని సీఎం
-కేసీఆర్ పై విరుచుకుపడ్డ కటకం మృత్యుంజయం
కరీంనగర్, ప్రతినిధి : యాదగిరిగుట్టకు కోట్లకు కోట్లు పోసి.. వేములవాడకు పైసా విదల్చని సీఎం కేసీఆర్ పక్షపాతం చూపిస్తున్నాడని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కటకం మృత్యుంజయం ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కరీంనగర్ లోని ఇందిర భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వయంగా కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచిన కేసీఆర్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. గద్దెనెక్కిన తర్వాత ఆర్భాటంగా కరీంనగర్ కు వచ్చిన కేసీఆర్.. జిల్లాకు చేసింది శూన్యమని.. కనీసం వేములవాడకు రూపాయి విదిల్చలేదని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు రూపాయి దక్కలేదని ఇది సీఎం వైఫల్యమని మండిపడ్డారు..
తాగునీటికి జనం అవస్థలు పడుతున్నారని.. హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని 20 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష కరువు నెలకొని ఉందని.. అక్కడి జనం గొంతెండుతోందని.. కానీ ప్రభుత్వం వరంగల్ కు తాగునీటిని ఎల్ ఎండీకి తరలిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రజల అవసరాలు తీర్చాకే వరంగల్ కు నీటిని పంపాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో ఇసుక , గ్రానైట్ మాఫియా కరీంనగర్ జిల్లాను దోచుకుంటుందని.. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయిస్తూ హింసిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులకు వాహనాలు సమకూర్చి వారిని అడ్డంగా టీఆర్ఎస్ వాడుకుంటోందని మండిపడ్డారు.
నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని.. దళితులకు మూడెకరాలు, పేదలకు డబుల్ బెడ్ రూంలేదు.. మైనార్టీ, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు టీఆర్ఎస్ అమలు చేయడం లేదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పథకాలనే కాపీ కొట్టిందని.. సోనియా విద్యా హక్కు చట్టం తెస్తే దాన్ని పేరుమార్చి కొనసాగిస్తోందని ఎద్దేవా చేశారు.. బడ్జెట్ లో కొత్త పథకాలకు ఊసు లేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మధు, శివపెల్లి రాజేశం, మూల జయపాల్, స్వామినాథాచార్యులు.., రహమత్, దామోదర్ రావు, తదితరులు పాల్గొన్నారు