
కరీంనగర్: కమీషనరేట్ పరిధిలో ప్రాణాంతక గుట్కా, పేద మధ్య తరగతి ప్రజల జీవితాలను చిన్నభిన్నం చేస్తున్న మట్కాలను సమూలంగా నియంత్రిండమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి..కమలాసన్ రెడ్డి అన్నారు. గుట్కా,మట్కా రహిత కమీషరేట్ నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. గురువారం నాడు తిమ్మాపూర్ మండలం ఎల్ యండి కాలనీ, మహత్మానగర్ లలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో సమావేశమై మాట్లాడుతూ అసాంఘీక శక్తుల కదలికల నియంత్రణ, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కార్డెన్ అండ్ సెర్చ్ లను నిర్వహిస్తున్నామన్నారు. జనసంచారం తక్కువగా ఉండే ఎల్ యండి ప్రాంతంలో అసాంఘీక శక్తులు ఆశ్రయం పొందే అవకాశం ఉందని చెప్పారు. గత 2009లో ఇద్దరు కరుడుగట్టిన దొంగలు ఎల్ యండి ప్రాంతంలో ఆశ్రయం పొంది ఎన్ కౌంటర్ మృతి చెందిన సంఘటనను ఈ ఈసందర్భంగా ఉదహరించారు. నూతనంగా అద్దెకు వచ్చే వారి వివరాలను పూర్తిగా తెలుసుకోవడంతో పాటు వారికి సంబంధించిన ధృవపత్రాలను యజమానులు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్త్ర్రెవ్ లను నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ఈ మధ్య జైలుశిక్షలు పడుతున్నాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. బ్లూకోట్స్ బృందాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని కితాబునిచ్చారు. షీటీం బృందాలు సత్ఫలితాలను సాధిస్తున్నాయని తెలిపారు. షీటీం బృందాలు మఫ్టీలో సంచరిస్తూ పోకిరీల ఆగడాలను అరికడుతున్నాయని, పోకిరీలు చేష్టలు శృతిమించినట్లయితే కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. వాహనాల కొనుగోలు సందర్భంగా వాహనదారులు పేరుమార్పిడి చేయించుకోవాలని లేనట్లయితే ఏవైనా సంఘటనలు జరిగిన సందర్భాలలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. అక్రమ కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా సరైనా ధృవపత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, ఒక కారు, మద్యం, గుట్కాను స్వాదీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎసిపి జె.రామారావు, సిఐ వెంకటరమణ, ఎస్ఐ కృష్ణారెడ్డి, బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్, డిస్ట్ర్రిక్ట్ గార్డ్స్ లతో పాటుగా పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.