
గాంధీలో వైద్య సేవల విస్తరణ
అందుబాటులోకి మరిన్ని సేవలు
పేషంట్లకు పరామర్శ
ఐసియు, ఎమర్జెన్సీ ఓపీ సేవలను పరిశీలించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
హైదరాబాద్ః
గాంధీ వైద్యశాలలో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చే ఆలోచన ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ప్రజలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సేవలకు మరిన్ని సేవలను తోడు చేస్తామన్నారు. గాంధీలో ఐసియు, ఎమర్జెన్సీ, ఓపీ సేవలను పరిశీలించిన మంత్రి రోగులను పరామర్శించారు. అనంతరం గాంధీ సూపరింటెండెంట్, ఆర్ఎంఓలకు తగు సూచనలు చేశారు.
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓపీ విభాగాన్ని, ఎమర్జెన్సీ, ఈ మధ్యే గవర్నర్ ప్రారంభించిన ఐసియు విభాగాలను పరిశీలించారు.
అలాగే పలువురు రోగులను పరామర్శించి, వారితో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కొందరు రోగులు వరండాలో ఉండటంతో వారితో మాట్లాడి, వెంటనే వారికి వైద్య సేవలు అందించాలని, రోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ వరండాల్లో, ఆరు బయట ఉంచ కూడదని, వెయిట్ చేసే పరిస్థితులు రాకుండా చూడాలని, మరింత పరిశుభ్రంగా ఎమర్జెన్సీ ఉండాలని ఆదేశించారు. అప్పటికప్పుడు కొందరికి వైద్య సేవలు అందేలా చేశారు. ముందుగా వైద్య మంత్రి ఓపీ సేవల విస్తరణ మీద దృష్టి సారించారు. ఓపీకి ఆనుకుని కొత్తగా విస్తరించిన భవనంలో ఓపీ సేవలు విస్తరించాలని యోచిస్తున్నారు. అలాగే, ఎమర్జెన్సీని విస్తరించాలని అధికారులను ఆదేశించారు.
ఎమర్జెన్సీని ఆనుకుని వున్న వెనుక విశాలమైన హాలుని కూడా ఎమర్జెన్సీకి వాడుకునే విధండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఎమర్జెన్సీ హాలు, పెరుగుతున్న పేషంట్లకు సరిపోవడం లేదన్నారు. అనంతరం మంత్రి ఈ మధ్యే గవర్నర్ ప్రారంభించిన ఐసియూని సందర్శించారు. అక్కడ పేషంట్లకు అందుతున్న వైద్య సేవలను చూశారు. ఈ సందర్భంగా పలువురు రోగులతో మాట్లాడారు. నాణ్యమైన వైద్యాన్ని రాజీ లేకుండా అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం డయాలసిస్ కేంద్రం కోసం కొత్తగా నిర్మాణమైన భవనాన్ని మంత్రి పరిశీలించారు.
ఆ భవనంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే, అనేక మంది రోగులకు మంచి వైద్య సింగిల్ యూజ్డ్ డయాలసిస్ అందుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. గాంధీ వైద్యశాలకు ఓపీ పెరిగిందని, మరోవైపు ఐపీ కూడా పెరుగుతున్నదని, మంచి వైద్య పరికరాలు, ఐసియూ వచ్చిన తర్వాత రోగులు మరింతగా వస్తున్నారని మంత్రి అన్నారు. వాళ్ళందరికీ వైద్యం అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు, గాంధీని మరింత విస్తరించే విధంగా ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వైద్య సిబ్బంది సైతం అందుకుతగ్గట్లుగా రోగులకు మెరుగైన, సమర్థవంతమైన సేవలు అందేలా పని చేయాలని మంత్రి ఆదేశించారు.
గాంధీ సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్, ఆర్ఎంఓలు, వైద్యులు మంత్రితోపాటు ఉన్నారు.