గల్ఫ్‌ దేశాల్లోని భారతీయులపై యుద్ధ ప్రభావం..!

న్యూఢిల్లీ: భారత్-పాక్ యుద్ధం.. ఈ క్షణాన ఏ ఇద్దరు కలిసినా మాట్లాడుకునే అంశం. అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశంగా మారిన అంశం. ఉగ్రమూకలకు వెన్నుదన్నుగా ఉన్న పాక్‌కు వెన్నులో వణుకుపుట్టిస్తున్న అంశం. భారతీయులకు సమరోత్సాహం కలిగిస్తున్న అంశం. అందరూ అనుకుంటున్నట్లు భారత్ పాక్ యుద్ధం వస్తే.. ఇతర దేశాలు కూడా  రెండు వైపులా చేరి పోరును తీవ్రం చేస్తే.. తదనంతర పరిస్థితుల సంగతి పక్కనపెడితే, యుద్ధం జరుగుతున్నన్ని రోజులూ ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో ఓ సారి తరచి చూస్తే గుండె భయపడుతుంది. కన్ను కన్నీరు కారుస్తుంది. మనస్సు చివుక్కుమంటుంది.

 పెద్దపెద్ద చదువులు చదివిన భారతీయులు అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలకు వెళ్తుంటే చిన్నాపాటి చదువులతో కుటుంబం కోసం.. అప్పుల బాధలు తీర్చడం కోసం గల్ఫ్ దేశాల బాట పట్టే వారు కోకొల్లలు. ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతర్, ఇరాక్ వంటి దేశాల్లో భారతీయుల సంఖ్య తక్కువేమీ కాదు. ఎంతో మంది ఎన్నో బాధలు పడుతున్నారని ఓ వైపు చెబుతూనే ఉన్నా.. కొన్నాళ్లు కష్టపడితే కుటుంబం సంతోషంగా ఉంటుందని వెళ్లేవాళ్లే అందరూ. అయితే గతంలో కార్గిల్ యుద్ధం సమయంలో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

యుద్ధం వస్తే.. ఆయా దేశాల్లో ఉండటం శ్రేయస్కరం కాదని భావించే భారతీయులు.. స్వదేశానికి వెళ్లాలనుకుంటే వీలుకుదరని పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. గల్ఫ్ దేశాల నుంచి భారత్ రావాలంటే పాకిస్తాన్‌ మీదుగా రావాల్సిందే. అందులోనూ యుద్ధం జరగుతోంది కాబట్టి విమానాల సర్వీసులు కూడా రద్దవుతాయి. ఒకవేళ విమాన సర్వీసులు నడిపినా ఆ టికెట్ రేట్లు అందుబాటులో ఉండే అవకాశం తప్పుకుండా ఉండదు.  తద్వారా ఆయా దేశాల్లో తమ వాళ్లు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అని ఇరువైపుల వాళ్లు మనోవేదన చెందే అవకాశం ఉంది. కార్గిల్ వార్ సమయంలో అదే జరిగింది. ప్రస్తుత లెక్కల ప్రకారం 22 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. ఇది గల్ఫ్ దేశాల జనాభాలో సుమారు 40 శాతం. 2013 లెక్కల ప్రకారం కువైట్‌లో 6 లక్షల 81 వేల 288 మంది భారతీయులు ఉన్నారు. ఇంత మొత్తంలో జనాభాపై యుద్ధ ప్రభావం పడే అవకాశం ఉంది.

యుద్ధం వస్తే… భారత్‌కు, గల్ఫ్ దేశాలకు సంబంధాలు పూర్తిస్థాయిలో తెగిపోతాయి. తద్వారా వాణిజ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఆయిల్ రేట్లు పెరుగుతాయి. కార్గిల్ సమయంలో ఇదే జరిగింది. యుద్ధం 1999 మే నుంచి అదే ఏడాది జూలై వరకూ జరిగింది. యుద్ధ సమయంలో సెన్సెక్స్ 7శాతం పడిపోయి 3773 వద్ద నిలదొక్కుకుంది. 2000వ సంవత్సరం ఫిబ్రవరికి అది 30 శాతానికి పెరిగింది. యుద్ధ సమయంలో రోజుకు 25 కోట్లు నష్టం వాటిల్లింది. అప్పట్లో డాలర్లతో పోల్చుకుంటే రూపాయి కనిష్ట స్థాయి 43కు పడిపోయింది. నష్టాలు బడ్జెట్‌ను తాకడంతో పదివేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం సిద్ధమయింది. మిలటరీకి ఎక్కువ నిధులను కేటాయించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది.

బుధవారం రాత్రి జరగిన దాడులకే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతే.. ఇక యుద్ధం వస్తే దాని ప్రభావం ఊహకు కూడా అతీతం. ఇటీవల సౌదీలో వచ్చిన ఆర్ధిక మాంద్యం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో కళ్లముందే కన్పిస్తోంది. దాని ప్రభావం నుంచి ఇంకా తేరుకోను కూడా లేదు. ఆర్ధికమాంద్యం వల్ల ఎంతో మంది భారత పౌరులను ఉద్యోగం నుంచి తీసేసిన విషయం తెలిసిందే. యుద్ధం వస్తే.. అటు ఉద్యోగం లేక, ఇటు స్వదేశం వెళ్లలేక భారతీయ కూలీల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది.

అంతేకాక ఇప్పటికే అప్పులు చేసి వీసాకు అప్లై చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న భారతీయుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. అప్పు చేసిన డబ్బు దరఖాస్తులకే సరిపోయి, చేతిలో చిల్లిగవ్వ లేకుండా వారి కుటుంబాలు పడే బాధలు వర్ణనాతీతం.  గల్ఫ్ దేశాల్లోని భారతీయులు ఎన్ని కష్టాలు అనుభవించినా ఇండియన్ ఆర్మీ విజయాలు వారికి ఆనందం కలిగిస్తాయనడంలో సందేహం లేదు. ఆ కష్టాల కన్నీళ్లన్నీ తుడుచిపెట్టుకుపోవడం ఖాయం.

Attachments area

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.