గతంతో పోలిస్తే తెలంగాణ అడవుల్లో మెరుగ్గా జంతు సంపద

*మంచి ఫలితాలు ఇస్తోన్న మూడు రోజుల పులులు, జంతు గణన

*పలు అటవీ ప్రాంతాల్లో పులులు, మాంసాహార జంతువుల కదలికలు గుర్తింపు

*27 నుంచి 29 దాకా శాఖాహార జంతువులు, వృక్ష జాతుల లెక్కింపు

మూడు రోజులుగా కొనసాగుతున్న పులులు, జంతువుల జాతీయ జనగణన తెలంగాణ అటవీ అధికారులు, సిబ్బందిలో ఆనందాన్ని నింపింది.  గతంలో 2014 ఉమ్మడి రాష్ట్రంలో భాగంగా జరిగిన సర్వేతో పోలిస్తే తెలంగాణలో ప్రస్తుతం అటవీ జంతువుల సంచారం మెరుగైనట్లు అధికారులు వెల్లడించారు.  తెలంగాణ అడవుల్లో మంచి స్థాయిలో వన్య మృగాలు, మాంసాహార జంతువులు నమోదు అవుతున్నాయని అధికారులు వెల్లడించారు. వారం రోజుల పాటు జరిగే జంతు గణనలో మొదటి మూడు రోజుల్లో అడవుల్లోని పలు బీట్లలో పులి, చిరుతు, ఎలుగుబంటి, నక్కలు, రేసు కుక్కల లాంటి మాంసాహార జంతువుల ఆనవాళ్లను పెద్ద సంఖ్యలో గుర్తించారు.  పూర్తి శాస్రీయ పద్దతుల్లో జంతువుల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. జంతువుల కాలి గుర్తులు, పెంటికలు, విసర్జితాలు, కళేబరాలు, చెట్లపై కాలిగోర్ల గుర్తుల ఆధారంగా ఏ ఏ జంతువులు ఏ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నాయో నమోదు చేశారు. పులుల సంరక్షణ ప్రాంతాలైన కవ్వాల్, అమ్రాబాద్ లో జంతువుల ఆనవాళ్లు ఆశించిన స్థాయిలో ఉన్నట్లు అక్కడి ఫీల్డ్ డైరెక్టర్లు వెల్లడించారు. కవ్వాల్, అమ్రాబాద్ అభయారణ్యాల్లో పులుల అడుగుల గుర్తులతో పాటు, వాటి ఆవాసంగా ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించారు.  కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోని బెజ్జూర్, పెంచికల్ పేట, పోతపల్లి, బొంబాయిగూడ బీట్లలో పులి పంజా గుర్తులను, సిర్పూర్ రేంజ్ లో చిరుత అడుగులను గుర్తించారు. ఇదే ప్రాంతంలోని ఏడు బీట్లలో ఎలుగుబంటి ఆనవాళ్లను అధికారులు నమోదు చేశారు.  కదంబ అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్  వెళ్తున్న మార్గంలో పులి కనిపించినట్లు, వెంటనే పులి రోడ్డు దాటి అడవిలోకి వెళ్లే దాకా డ్రైవర్ బస్సును ఆపారని అటవీ అధికారులు వెల్లడించారు. భూపాలపల్లి అటవీ ప్రాంతంలో చిరుత పులి, అడవి దున్నల సంచారాన్ని గుర్తించారు. అమ్రాబాద్ దట్టమైన అటవీ ప్రాంతం మల్లయ్య లొద్దిలో సర్వేలో పాల్గొన్న వాలంటీర్లను పులి కనిపించింది. మొత్తం 14 బీట్లలో చిరుతల సంచారం స్పష్టంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదిలాబాద్ అడవుల్లో పెద్ద సంఖ్యలో అడవి దున్నలు కూడా సర్వే చేస్తున్న సిబ్బంది కంటపడ్డాయి.

telangana atavi adikarulu 1

ఈ నెల 22 నుంచి మొదలైన ఈ సర్వేలో అటవీ శాఖ మంత్రి జోగు రామన్న స్వయంగా పాల్గొన్నారు. కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉట్నూరు సమీపంలో కోలంగూడ రేంజ్ లో మంత్రి సుమారు ఆరు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో పర్యటించి జంతువుల ఆనవాళ్లు అధికారులతో కలిసి గుర్తించారు.  రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జంతువుల సర్వేలో అరణ్య భవన్ నుంచి ఉన్నతాధికారులు కూడా పాల్గొని పర్యవేక్షించారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట రేంజ్ లో పీసీసీఎఫ్ ( ఐ.టీ) రఘువీర్,  కాగజ్ నగర్ ప్రాంతంలో అదనపు అటవీ సంరక్షణ అధికారి మునీంద్ర, కవ్వాల్ ప్రాంతంలో సునీల్ కుమార్ గుప్త , ఖమ్మం జిల్లాలో జరిగిన సర్వేలో ఎం.పృధ్వీరాజ్. పలు జిల్లాల్లో జంతు జన గనణ తీరును కలెక్టర్లు పర్యవేక్షించారు.  కొందరు కలెక్టర్లు స్వయంగా అటవీ ప్రాంతానికి వెళ్లి సర్వేలో పాల్గొన్నారు. అటవీ అధికారులు, సిబ్బందితో పాటు సర్వేలో పాల్గొన్న వందలాది మంది వాలంటీర్లను పీసీసీఎఫ్( వైల్డ్ లైఫ్) డాక్టర్ మనో రంజన్ భాంజా, వైల్డ్ లైఫ్ ప్రత్యేకాధికారి శంకరన్ సమన్వయ పరిచారు.  జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు సర్వేకు సెలవు ప్రకటించారు. 29 దాకా జరిగే ఈ కార్యక్రమంలో  మిగతా మూడు రోజుల్లో  శాఖాహార జంతువుల లెక్కింపుతో పాటు, ఆయా అటవీ ప్రాంతాల్లో ఉన్న వృక్ష, మొక్కల జాతుల గుర్తింపు, అడవుల్లో మనుషులు, పెంపుడు జంతువుల సంచారం నమోదు కూడా జరుగుతుంది.

telangana atavi adikarulu 2     telangana atavi adikarulu 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *