
కరీంనగర్: జిల్లాలో గణేష్ నిమజ్జనంకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. గురువారం అధికారులతో గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం జరిగే అన్ని ప్రాంతాలలో భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. అన్ని రూట్లలో లైటింగు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. నిమజ్జనం జరిగే రూట్లలోని గుంతలను పూడ్చివేసి, రోడ్లను పరిశుభ్రంగా ఉంచనున్నట్లు తెలిపారు. నిమజ్జన ప్రాంతాలలో పారిశుద్ద్య నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ కార్పోరేషన్ లో మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
చింతకుంట చెరువులో నీరు లేదని, ఎస్.ఆర్.ఎస్.పి నీరు విడుదలకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రానైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 6 క్రేనులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని నిమజ్జన ప్రాంతాలలో గజ ఈతగాళ్లను నియమిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం రోజున నిమజ్జన ప్రాంతాలలో నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉంటుందని అన్నారు. కరీంనగర్ లో ప్రత్యామ్నాయంగా జనరేటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగడానికి అందరూ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, జిల్లా రెవెన్యూ అధికారి టి. వీరబ్రహ్మయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి కరీంనగర్ చంద్రశేఖర్, గ్రానైట్ అసోసియేషన్ తరపున సతీష్ తదితరులు పాల్గొన్నారు.