
-ఈనెల 7-11 లోగా దరఖాస్తు చేసుకోమన్నారు..
-ప్రభుత్వ వెబ్ సైట్లలో అప్లైకి లింకే లేదు..
-ప్రభుత్వం ప్రకటించిన ఖాళీలు లేవంటున్న ఎంఈవోలు..
– అయోమయంలో నిరుద్యోగులు..
=====================
ప్రభుత్వ నిర్లక్ష వైఖరితో విద్యావలంటీర్ల నియామకం గందరగోళంలో పడింది.. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇటీవల 7వేలకు పైగా విద్యావలంటీర్ల నియామకాలను చేస్తున్నట్టు ప్రకటించారు. ఈనెల 7 నుంచి 11 వరకు నిరుద్యోగులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసి.. వారివారి సొంత మండలకేంద్రాల్లో ఎంఈవోలకు దరఖాస్తు చేసుకున్న ప్రతులను ప్రింట్ తీసుకొని ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు వెబ్ సైట్ అడ్రస్ కూడా ఇచ్చారు.. కానీ నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఈ నియామకాల ప్రక్రియ వెబ్ సైట్లో అసలు మొదలే కాలేదు..
వెబ్ సైట్లో దరఖాస్తుకు లింకే లేదు..
ప్రభుత్వం విద్యావలంటీర్ల నియామకాలకు ఈ నెల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అందుకుగాను http://ssa.tg.nic.in/ వెబ్ సైట్ ద్వారా అయా జిల్లాల్లో మండలం యూనిట్ గా దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. పాఠశాలల్లో ఖాళీల వివరాలను సైతం తెలిపింది.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొన్ని మండలాల్లో ఖాళీలుండగా.. మరికొన్నివాటిల్లో అసలు ఖాళీలే లేవు.. ముందుగా ఏ గ్రామ పాఠశాలలో ఖాళీ ఉంటే ఆ గ్రామం నిరుద్యోగులకు అవకాశం కల్పించేలా నిబంధనలు రూపొందించారు. దీంతో సొంత మండలంలో పనిచేసే అవకాశం దక్కుతుండడంతో నిరుద్యోగులు వందల మంది సోమవారం సదురు ప్రభుత్వ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకునేందుకు వెతకారు… కాగా అసలు ప్రభుత్వం వెబ్ సైట్లో దరఖాస్తు ప్రక్రియ.. ఖాళీల వివరాలు.. దరఖాస్తు లింకే లేకపోవడంతో విస్మయానికి గురయ్యారు. ఖాళీల వివరాలు కూడా ముందు ప్రకటించిన కరీంనగర్ డీఈవో వెబ్ సైట్లో ఇప్పుడు అవి మాయమయ్యాయి.. కాగా ఈనెల 11 వరకు ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ కావడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది..
విద్యావలంటీర్ల ఖాళీలు గల్లంతు..
ఆన్ లైన్లో ప్రకటించిన విద్యావలంటీర్ల ఖాళీలు.. బెజ్జంకి మండలంకొచ్చేసరికి మాయమయ్యాయి..కరీంనగర్ డీఈవో వెబ్ సైట్లో బెజ్జంకి మండలంలోని రంగనాయకపల్లె పాఠశాలలో ఆరుపోస్టులకు రెండు ఖాళీలున్నట్టు పేర్కొన్నారు. దీంతో రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మండలంలోని యువత ఎంఈవోలను విధివిధానాల కోసం సంప్రదించగా.. ‘‘ఎక్కువ ఉన్న చోటు నుంచి ఉపాధ్యాయులను సదురు పాఠశాలకు పంపిస్తున్నామని .. ఆ పాఠశాలలో 30 మంది విద్యార్థులకు సరిపడా నలుగురు ఉపాధ్యాయులు సరిపోతరని… అక్కడ విద్యావలంటీర్ల అవసరం లేదని’’ మండల ఎంఈవో తెలిపారు. దీంతో నిరుద్యోగులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వ చూపించిన ఖాళీలకు క్షేత్రస్థాయిలో ఖాళీలకు పొంతన లేకపోవడంతో తమకు ఉద్యోగాలు వస్తాయో రావేమోనని ఆందోళనలో ఉన్నారు..