
వరంగల్ అర్బన్ జిల్లా ఖాజీపేటలో నిర్మించ తలపెట్టిన వాగన్ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. గురువారం సచివాలయంలో రైల్వే ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ మిశ్రా, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, మెట్రోరైల్ యం.డి. శ్రీ ఎన్ వి యస్. రెడ్డి, యస్ సిఆర్ జి.ఎం. శ్రీ వినోద్ కుమార్ యాదవ్, లా సెక్రటరీ శ్రీ నిరంజన్ రావు, సింగరేణి సి.యం.డి శ్రీ శ్రీధర్ లతో పాటు రైల్వే, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 380 కోట్ల ఖర్చుతో నిర్మించే ఓవర్ హాలింగ్ వర్కు షాపు ద్వారా 2000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రెవెన్యూ అధికారులు అత్యధిక ప్రాధాన్యతతో భూసేకరణను పూర్తి చేయనున్నారు. రైల్వే ఖర్చు 2018-19 లో 200 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 38 కోట్లు విడుదల చేసిందని అన్నారు. మెదక్,అక్కన్న పేట, మనోహరాబాద్, కొత్తపల్లి, రైల్వే లైన్ల నిర్మాణంపై సమీక్షించారు. వీటికి సంబంధించి భూసేకరణను పూర్తి చేయాలని అధికారులను కోరారు, భద్రాచలం సత్తుపల్లి రైల్వే నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రైల్వే ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి కలెక్టర్ల వీడియోకాన్ఫరెన్సులో ప్రత్యేక అంశంగా చేర్చాలన్నారు. MMTC Phase II, RUB ల నిర్మాణం, చర్లపల్లి రైల్వేటర్మినల్, తదితర అంశాలను సమీక్షించి పనుల సత్వర పూర్తికి సమన్వయంతో పనిచేయాలని, లక్ష్యాల ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రైల్వే మంత్రిత్వశాఖ,తెలంగాణ ప్రభుత్వం మధ్య జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు ఒప్పందంపై చర్చించారు.