క‌ల్తీకి పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు: వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి

క‌ల్తీకి పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు: వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి

నాణ్య‌మైన ఆహారం వినియోగ‌దారుల హ‌క్కు

క‌ల్తీని గుర్తించే ప‌ద్ధ‌తులూ తెలుసుకోవాలి

ప్ర‌జారోగ్యంతో ఆట‌లాడితే అంతే సంగ‌తులు

ఆహార క‌ల్తీపై ప‌టిష్ట‌మైన చ‌ట్టం

ముందుగా అవ‌గాహ‌న‌, చైత‌న్యం

అప్ప‌టికీ విన‌క‌పోతే పీడీ యాక్టు ప్ర‌యోగం

హైద‌రాబాద్:  మేం మిమ్మ‌ల్నేమీ చేయం… మీకు వాడుతున్న ఆహార ప‌దార్థాలు నాణ్య‌మైన‌వేనా? క‌ల్తీ చేస్తున్నారా? చెప్పండి చాలు… ఇంత‌కీ ఈ నూనె ఏం నూనె… ఏ కంపెనీది? ఎన్ని సార్లు ఇలా వేడి చేస్తారు? ఈ నూనెతో ఏమేం వండుతున్నారు? మీ ఇంటిని ఇలాగే ఉంచుకుంటారా? హోట‌ల్‌ని ఇంత అద్వాన్నంగా ఎందుకు నిర్వ‌హిస్తున్నారు? వైఎంసిఓ చౌర‌స్తాలో నిర్వ‌హిస్తున్న ఒక హోట‌ల్ య‌జ‌మానితో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి.ఆ వెంట‌నే ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాలు ప‌రిశీలించి, టీ పొడి, మంచినీరు, బ‌ఠానీ, పాలు వంటి పాదార్థాల‌ను త‌మ వెంట వ‌చ్చిన మోబైల్ వాహ‌నంలో ప‌రీక్ష‌ల‌కు పంపించారు. ఆ ప‌క్క‌నే టీ తాగ‌డానికి వ‌చ్చి కూర్చున్న వినియోగ‌దారుల‌తో… మీరు ఎక్క‌డి నుంచి వ‌చ్చారు. రెగ్యుల‌ర్ గా టీ ఇక్క‌డే తాగుతారా? ఈ టీ పొడి, పాలు నాణ్య‌మైన‌వేన‌న్న విష‌యం మీకు తెలుసా?… మంచి ఆహారం తీసుకోండి. ఆరోగ్యంగా జీవించండి. న‌న్ను గుర్తు ప‌ట్టారా? ఆహార పదార్థాల క‌ల్తీని ప‌రీక్షించి, ప‌రిశీలించి, క‌ల్తీ నివారించ‌డానికి వ‌చ్చాను. ఆల్ ది బెస్ట్‌… అంటూ ఆ ప‌క్క‌నే ఉన్న మ‌రో బేక‌రీకి వెళ్ళారు.. బేక‌రీ య‌జ‌మానితో… మీకు ప‌ర్మీష‌న్ ఉందా? ఈ బ్రెడ్‌, బేక‌రీ వ‌స్తువులు మీరే త‌యారు చేస్తారా? ఎక్క‌డి నుంచి తెస్తారు? ఒక‌వేళ మిగిలితే ఏం చేస్తారు? పాచివి కూడా అమ్మేస్తున్నారా? ఫుడ్ సేఫ్టీ స‌ర్టిఫికేట్ ఉందా? య‌జ‌మాని త‌డ‌బ‌డుతూ, సార్‌.. ఈ మ‌ధ్య ఈ దుకాణాన్ని తీసుకున్నాను. అన‌గానే వెంట‌నే అధికారుల‌ను పుర‌మాయిస్తూ…. ఇలాంటివ‌న్నీ ప‌రిశీలించండి…. క‌ల్తీని నివారించండి…. అంటూ ముందుకు సాగుతూ…. ఆ ప‌క్క‌నే  రోడ్డు మీదే ఉన్న సోడా బండి వ‌ద్ద మంత్రి ఆగారు…. ఏం పేరు… ఈ బాటిల్ ఏం ఉంది. చ‌క్క‌ర‌ను ముందే క‌లుపుకుని వ‌స్తావా? ఎందుకు ఇంత నాసీ ర‌కం నిమ్మ‌కాయ‌లు వాడుతున్నావ్‌? ఐస్ ఎక్క‌డి నుండి తెస్తావ్‌? ఐస్‌కి బిల్లు ఇస్తారా? ఇవ్వ‌క‌పోతే ఎందుకు ఊరుకుంటున్నావు? మ‌ంచి పానీయం జ‌నాల‌కివ్వు? అంద‌రూ నీ ద‌గ్గ‌ర‌కే వ‌చ్చి తాగుతారు…. ఈ లోగా మొద‌టి హోట‌ల్ నుంచి తీసిన శాంపిల్స్  ఫ‌లితాలు వ‌చ్చాయి? వెంట‌నే  వ్యాన్‌లోకి ఎక్కిన మంత్రి.. ఆ ప‌రీక్ష‌లు ఎలా చేశార‌ని అడిగారు. ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను ఎలా గుర్తు ప‌డ‌తార‌ని తెలుసుకున్నారు. ఆ వివ‌రాల‌ను అక్క‌డే ఉన్న మీడియా, ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. రెండు చేతులా పాలు ఉన్న ప‌రీక్ష నాలిక‌ల‌ను ప‌ట్టుకుని క‌ల్తీ జ‌రిగిన‌, క‌ల్తీ జ‌ర‌గ‌ని పాల‌ను వివ‌రించారు.

laxma reddy 1

అలాగే టిష్యూ పేప‌ర్ మీద వేసిన టీ పొడిలో కొద్దిగా నీళ్ళు పోశారు. క్ష‌ణాల్లో ఒక చేతిలో ఉన్న టీ పొడి రంగుతో టిష్యూ పేప‌ర్ త‌డిచింది. మ‌రో చేతిలో ఉన్న టీ పొడి త‌డిచినా అలాగే ఉంది. రంగు తేలింది క‌ల్తీ టీ పొడ‌ని, అందులో రంగు క‌లుపుతున్నార‌ని తేల్చేశారు. అలాగే బ‌ఠానీలు కూడా రంగు చ‌ల్లిన‌విగా గుర్తించారు. ఇలా ఒక్కో ప‌రీక్ష‌లు పూర్త‌య్యాక య‌జ‌మానిని పిలిపించారు మంత్రి.  ఇదిగో నీ ద‌గ్గ‌ర పాలు, బ‌ఠానీలు, టీ పొడి ఇలా క‌ల్తీవి క‌నిపిస్తున్నాయి. ఇవ‌న్నీ నీవెక్క‌డ తెస్తున్నావు? ఇక నుంచి అక్క‌డ ఆ వ‌స్తువులు కొనుగోలు చేయ‌కు…. మంచి వ‌స్తువులు తీసుకో… ఇలాగే ఇంకో సారి జ‌రిగితే చ‌ర్య‌లు తీసుకుంటాం. ప్ర‌స్తుతానికి వ‌దిలేస్తున్నాం. అంటే సుతి మెత్త‌గా హెచ్చ‌రించారు. ఆ వెంట‌నే అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.  ఈ లోగా నారాయ‌ణ గూడాలో ఒక టిఫిన్ సెంట‌ర్‌ని చూద్దామ‌ని ఒక మీడియా మిత్రుడి స‌ల‌హా… ఆ వెంట‌నే అక్క‌డ‌కు క‌దిలారు మంత్రి ల‌క్ష్మారెడ్డి.  నేరుగా వెళ్లి నూనెను ప‌రిశీలించారు. అక్క‌డి రెడీ చేసిన పిండి ఉంది. చూశారు. కారం, ప‌సుపు పొడుల‌ను తీసుకున్నారు. ఒక చిన్న క‌ప్పులో నీటిని తీసుకుని ఒక క‌ప్పులో కారం పొడిని, మ‌రో క‌ప్పులో పసుపు పొడిని వేశారు. పొడి అంతా అడుక్కు చేరింది. దీంతొ ఆ రెండు వ‌స్తువులు మంచివేన‌ని తేలింది. ఆ ప‌క్క‌నే ఉన్న చిన్న టీ కొట్టుకు చేరారు. టీ పొడిని తీసి చిన్న నీటి గ్లాసులో పోశారు. అంతే అంతా రంగు మ‌యం. ఈ టీ పొడి ఎక్క‌డ తెస్తున్నార‌న్నారు. క‌ల్తీద‌ని చెప్పారు. మా య‌జ‌మానికి తెలుసు స‌ర్‌, నేను జీత‌గాడిని అన్నాడ‌త‌ను. వెంట‌నే ఆ టీ పొడి తీసుకుని ప‌రీక్ష‌ల‌కు పంపించారు. సంబంధిత అధికారుల‌ను పిలిచి, వెంట‌నే త‌గు చ‌ర్య‌లు తీసుకోండ‌ని ఆదేశించారు. ఇక మ‌రో ప‌క్క హోట‌ల్‌కి వెళ్ళారు. కౌంట‌ర్ మీద ఉన్న వ్య‌క్తిని ప‌ర్మీష‌న్ ఉందా అని అడిగారు…ఉంద‌ని చూపించారు. టీ పొడిని ప‌రిశీలించాల‌ని అడ‌గ్గా…అత‌డు చ‌క్కెర‌లో క‌లిపిన టీ పొడిని తీసి చూపించాడు…. ఆప‌క్క‌నే ఉన్న వినియోగ‌దారుల‌తో కాసేపు ముచ్చ‌టించి, మంచి ఆహారాన్నే తీసుకోండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండ‌ని చెప్పారు మంత్రి…. అక్క‌డి నుంచి బ‌య‌లు దేరిన మంత్రి కిర‌ణ్‌కుమార్ రెడ్డి అనే వ్య‌క్తి ఎదురొచ్చాడు…. స‌ర్‌, మా జీవితంలో ఇలాంటి ప్ర‌భుత్వాన్ని, సీఎంని, మీ లాంటి మంత్రిని చూడ‌లేదు స‌ర్‌. మంత్రే స్వ‌యంగా మా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మా బాగోగులు, మేం తీసుకునే ఆహారం ఎలాంటిద‌ని, మంచి ఆహారం తీసుకోండ‌ని చెప్పినట్లు మాకు తెల‌వ‌దు. మీరు వ‌చ్చారు. అన్నీ ప‌రిశీలిస్తున్నారు. మీ అంద‌రూ ప‌ని చేస్తే రాష్ట్రంబాగుప‌డ‌త‌దంటూ…న‌మ‌స్క‌రించాడు. మంత్రి అత‌డిని థాంక్స్ చెప్పి ముందుకు క‌దిలారు.  ఇదంతా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డ శుక్ర‌వారం క‌ల్తీ నివార‌ణకు ఈ మ‌ధ్యే ప్రారంభించిన మోబైల్ వ్యాన్‌ని తీసుకుని నేరుగా జ‌నంలోకి వెళ్ళిన‌ప్పుడు జ‌రిగిన సంగ‌తులు.  అయితే, మంత్రి ల‌క్ష్మారెడ్డి అత‌ర్వాత మీడియాతో మాట్లాడారు. క‌ల్తీ నివార‌ణ‌కు అంతా క‌లిసి క‌ట్టుగా న‌డుం బిగించాల‌ని కోరారు. మీడియా పాత్ర చాలా కీల‌క‌మైంద‌ని చెప్పారు. క‌ల్తీకి పాల్ప‌డితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. నాణ్య‌మైన ఆహారం వినియోగ‌దారుల హ‌క్కున్నారు. ప్ర‌జ‌లు క‌ల్తీని గుర్తించే ప‌ద్ధ‌తులూ తెలుసుకోవాలి. క‌ల్తీ లేని ఆహారాన్నే తీసుకోవాల‌ని సూచించారు. ఎవ‌రైనా స‌రే, ప్ర‌జారోగ్యంతో ఆట‌లాడితే వ‌దిలేది లేద‌ని హెచ్చ‌రించారు. కేంద్రం-రాష్ట్ర ప్ర‌భుత్వం క‌లిసి క‌ట్టుగా క‌ల్తీపై పోరాటం చేస్తున్నాయ‌న్నారు. క‌ల్తీ నివార‌ణ‌కు ప‌టిష్ట‌మైన చ‌ట్టాలు చేస్తున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టి దాకా చ‌ట్టాలు స‌రిగా లేక‌పోవ‌డంతో నివార‌ణకు ఇబ్బందీగా మారింద‌న్నారు. క‌ల్తీ మీద ముందుగా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న‌, చైత‌న్యం క‌లిగి స్తామ‌ని చెప్పారు. అలాగే హోట‌ల్స్‌కి గ్రేడింగ్ ఇవ్వాల‌ని కూడా యోచిస్తున్నామ‌న్నారు. అప్ప‌టికీ విన‌క‌పోతే, క‌ల్తీకే పాల్ప‌డితే అలాంటి వాళ్ళ‌పై  పీడీ యాక్టు ప్ర‌యోగించ‌డానికి కూడా వెనుకాడ‌బోమ‌ని మంత్రి హెచ్చ‌రించారు.  ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి వెంట ఐపీఎం డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ శంక‌ర్‌, ఫుడ్ ఇన్‌స్పెక్ట‌ర్లు, అధికారులు, టెక్నీషియ‌న్లు, మోబైల్ వ్యాన్ సిబ్బంది త‌దిత‌రులు ఉన్నారు.

laxma reddy 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *