క్రమశిక్షణ నుంచి కలెక్షన్ వైపు…

మొన్నటి వరకు టాలీవుడ్ ను ఏలిన నలుగురు టాప్ హీరో్ల్లో ఆయన ఒకరు.  వివాద రహితుడిగా.. సౌమ్యుడిగా.. విజయాలకు మారు పేరుగా టాలీవుడ్ లో ఆయనకు రికార్డు ఉంది.  కలెక్షన్లు, రికార్డుల గురించి పట్టించుకోకుండా నిర్మాతల హీరోగా పేరుతెచ్చుకున్నాడు. కానీ ప్రస్తుతం  విజయాల్లో కాస్త వెనుకబడినా.. మళ్లీ ఈ మధ్యే పుంజుకుంటున్నాడు. మొన్నటి వరకూ  ఆయన అభిమానులు కూడా అలాగే నడుచుకున్నారు. కానీ సదరు హీరో తన అభిమానులకు కూడా ఇతర విషయాల్లోకి వెళ్లకుండా తమ కుటుంబం, కేరిర్ గురించి చూసుకున్నాకే తన సినిమాల గురించి పట్టించుకోవాలని ఇప్పటికీ చెప్తుంటాడు.. అలా అభిమానుల బాగోగులు చూసే ఆ హీరో పై టాలీవుడ్ అభిమాన సంఘాల్లో మంచి పేరుంది.

కానీ ప్రస్తుతం ఆ హీరో అభిమాన సంఘాల్లో కొందరి వైఖరి ఇప్పుడు చర్చనీయాంశమైంది. హీరో చెప్పిన విషయాల్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు సదరు అభిమాన సంఘం నేత.. కొంత కాలంగా జిల్లాల్లో మీటింగ్ లు పెడుతూ హీరో అభిమాన సంఘం పేరిట భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాడు.. తమ హీరో పేరిట సేవా కార్యక్రమాలంటూ అభిమానుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడట.. ఒక్కో జిల్లా నుంచి కనీసం 30 నుంచి 50 వేల రూపాయాలు అలా వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయం  సదరు హీరోకు తెలియకుండా బాగానే మేనేజ్ చేస్తున్నాడు. ఈ విషయమై హైదరాబాద్ లో సదరు అభిమానులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో వసూళ్ల దందాపై చర్చించారు. తెలంగాణలోని ఓ జిల్లాలో సదరు అభిమాన అధ్యక్షుడి పేరిట.. ఆ హీరో సినిమాకు టికెట్లు తీసుకొని అధిక ధరకు అమ్ముకున్నట్టు సమావేశంలో అభిమానులు నిలదీశారు. ఈ విషయంపై ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లినట్టు సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. సదరు వ్యక్తికి ఎటువంటి బాధ్యతలు ఇవ్వలేదని.. నామమాత్రంగా బాధ్యతలు అప్పగించినట్టు సదరు నేత చెప్పుకొచ్చాడట.. తరువాత జిల్లాల వారీగా సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయం తీసుకొని అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని సదరు నేత తప్పించుకున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం మిగతా జిల్లాల్లో పెద్దగా సమావేశాలు పెట్టకపోయినా ఆరోపణలు ఎదుర్కొన్న జిల్లాకు వెళ్లి మరీ అదే వ్యక్తిని అధ్యక్షుడిగా ప్రకటించినట్టు తెలిసింది.. డబ్బులు భారీగా ముట్టజెప్పడంతోనే సదరు నేత ఆరోపణలున్న వ్యక్తికి వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టు తెలుస్తోంది.. ఆ హీరోను కలిపించి ఫొటోలు దించాలన్నా సదరు నేతకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే.లేదంటే హీరోగారు బిజీ అని దాటవేయడం అలవాటు.

 ఈ తతంగమంతా కొందరు అభిమానులు.. హీరోకు చెప్పడంతో మొదట్లో ఆయన నమ్మలేదు. తరువాత సదరు నేతను, అభిమానులను పిలుపించుకొని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడట.. వసూళ్లతో తనకు డ్యామేజ్ వస్తుందని హెచ్చరించాడట.. ఇటువంటి వసూళ్లు రిపీట్ అయితే బాగుండదని గట్టిగా హెచ్చరించాట.. అయినా కూడా వినని సదరు అభిమాన సంఘం నేత ఇటీవల జరిగిన ఐపీఎల్ టికెట్ల పాసుల్లో కూడా హీరోను వాడుకోవడం గమనార్హం. వాటిని భారీ ధరకు తన అనుచరుల చేత  అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా బయటకు పొక్కింది.ఇప్పటికీ సదరు నేత తన పంథాను వీడకపోవడం పైగా.. ఓపెన్ గానే వసూళ్లకు పాల్పడుతుండడం గమనార్హం.. మరి ఈ విషయం ఆ హీరోకు తెలిసిందో లేదో కానీ ఈ వసూళ్ల దందాతో చెడ్డ పేరు మాత్రం ఆయనకే వస్తోంది. ఇప్పటికైనా సదరు హీరో స్పందిస్తే మంచిది..

ఇప్పటివరకు క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న సదరు అభిమాన సంఘం ఈ వసూళ్ల దందాతో అవినీతి కూపంలో కూరుకుపోయింది. మంచి పేరున్న ఆ హీరోకు సైతం ఈ మకిలి అంటుకుంది. దీనిపై స్పందించకపోతే సదరు హీరో డ్యామేజ్ భారీగా పడిపోవడం ఖాయం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *