
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పే థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేటాయించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ ను కోరారు. నార్త్ గ్రిడ్ నుంచి సౌత్ గ్రిడ్ కు ట్రాన్స్ మిషన్ కారిడార్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కోరారు. ఈ రెండు విషయాలపై తాను దృష్టి సారిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
క్యాంపు కార్యాలయంలో గురువారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సీఎంను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కోతల్లేని విద్యుత్ సరఫరా చేయడం పట్ల అభినందనలు తెలిపారు. దేశంలో నే తొలి ఏడాదే 2500 మెగావాట్ల మేర సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సిద్దం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ సౌర విధాన పత్రాన్ని తన వెంట తీసుకెళ్లారు.
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ కవిత, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, కేంద్ర, రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.