Breaking News

కోడి పందాలరాయుళ్లకు సందు దొరికింది

kodi-pandalu

కోడి పందాల సంప్రదాయాన్ని నిలిపివేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సుప్రీంకోర్టు బ్రేక్‌ వేసింది. అయితే మళ్లీ విచారణ చేయాలంటూ ఆదేశమిచ్చింది. పండగ ముందుకొచ్చింది. హైకోర్టు మళ్లీ విచారించేలోపు ఎవరికివాళ్లు తమ కోళ్లను పందానికి దువ్వేద్దామని సిద్ధమైపోతున్నారు. అంత సీనేమీ లేదు.. తమ దగ్గరా చట్టాల పుంజులున్నాయని.. వాటిని బరిలోకి దింపుతామని పోలీసులంటున్నారు.
పందాలకు కోళ్లు రెడీ..
కోడి పందాలరాయుళ్లకు సందు దొరికింది. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా లేకపోయినా.. పునర్విచారణ అని చెప్పిన ఒక్క పాయింటు చాలు.. తామిక రెచ్చిపోతామంటున్నాయి పందెం కోళ్లు. అసలు సుప్రీంకోర్టు తీర్పు కోసం కూడా వేచి చూడకుండా పందాలకు సిద్ధమైపోయిన కోడిరాజులంతా.. ఇప్పుడు తాజా ఆదేశాలతో కొక్కొరొక్కో అంటూ పందానికి కూత పెట్టేస్తున్నారు.
నెల రోజుల పాటు పందాల హోరు..
ఏపీలో సంక్రాంతి పండగ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్‌లో కోడిపందాలు జోరుగా జరుగుతాయి. సుమారు 15 నుంచి నెల రోజుల పాటు ఈ పందాల హోరు ఉంటుంది. కాలుకు కత్తి కట్టి కదన రంగంలో దూకి ఓడిన వేల కోళ్లు మృత్యువాత పడుతాయి. గెలిచిన కోళ్లు తీవ్రంగా గాయపడి పందేపు రాయుళ్లకు కాసులు కురిపిస్తాయి. వందల కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. ఇదంతా ప్రతి ఏటా జరిగే తంతే.
వందల కోట్ల లావాదేవీలు..
కోడి పందాలపై నిషేధం విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ఈ కేసును పునర్‌ విచారించి సమస్యను పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు యథాస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే హైకోర్టులో వాదనలు వినిపించాలని జంతు సంక్షేమ బోర్డును ఆదేశించింది. కోడి పందాలకు అనుమతించాలంటూ బీజేపీ నేత రఘురామకృష్ణంరాజు సుప్రీంను ఆశ్రయించారు. కోడి పందాలు సంక్రాంతి సంస్కృతిలో భాగమని.. వాటిని నిషేధించడం తగదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీం..
జంతువులను హింసించడం తగదని భావించిన హైకోర్టు ఇటీవలే కోడి పందాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జల్లికట్టు విషయంలో సుప్రీం కోర్టు తీర్పును హైకోర్టు ప్రస్తావించింది. దాంతో హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ పలువురు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే సుప్రీం ఇచ్చిన తీర్పు పందేపురాయుళ్లకు కల్పతరువులా మారనుంది. కేసు పునర్‌ విచారణ అంటే ఇప్పటికిప్పుడు పరిష్కారమయ్యే విషయం కాదు. సంక్రాంతి మూడు రోజులే కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. అదీ పండగకు ఒక్కరోజు ముందే సుప్రీం ఆదేశాలు జారీ చేయడం పందేపురాయుళ్లకు ఫెస్టివల్‌ బోనాంజ ఆఫర్‌లా మారింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *