
వరంగల్ , ప్రతినిధి : తెలంగాణ సీఎం కేసీఆర్ కొమురవెల్లి మలన్న స్వామిపై వరాల జల్లు కురిపించారు. మల్లన్న ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని సీఎం అన్నారు. వరంగల్ జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న కళ్యాణోత్సవంలో కేసీఆర్ పాల్గొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల తరహాలో బ్రహ్మాండమైన కాటేజీలు ఇక్కడ నిర్మించవచ్చన్నారు.
హైదరాబాద్‌లో దొడ్డి కొమురయ్య భవన్ నిర్మాణం..
దొడ్డి కొమురయ్య పేరు మీద హైదరాబాద్‌లో భవనం లేకపోవడం పెద్ద వెలితి అన్న ఆయన.. దొడ్డి కొమురయ్య భవన్ కట్టేందుకు 5 కోట్ల నిధులు, ఎకరం స్థలం కేటాయిస్తామన్నారు. హైదరాబాద్ దద్దరిల్లే విధంగా దొడ్డి కొమురయ్య భవన్ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.
కురుమలకు రాజకీయ ప్రాతినిథ్యం..
గొర్రెల పెంపకానికి పరిస్థితులు అనుకూలంగా లేవని.. పిల్లలను బాగా చదివించాలని స్థానికులకు సూచించారు. కురుమలకు రాజకీయ ప్రాతినిథ్యం లేదని తప్పకుండా కల్పిస్తామన్నారు. చదువురాకున్నా వీరికి తెలివితేటలున్నాయని కొనియాడారు.
దేవాదాయ అధికారులతో సీఎం సమీక్ష
కొమురవెల్లి గెస్ట్ హౌస్‌లో దేవాదాయశాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. రాజీవ్ రహదారి నుంచి ఆలయం వరకు 40 కోట్లతో మల్లన్న నెక్లెస్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 162 ఎకరాల ఆలయ భూములను కబ్జా నుంచి రక్షించేందుకు జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. శైవ క్షేత్రంగా గుర్తించేందుకు గోపురంపై భాగంలో భారీ త్రిశులం, డమరుకం ఏర్పాటు చేస్తామన్నారు.