
ఏఎన్, హైదరాబాద్ : పాలేరు ఉప ఎన్నిక విజాయనంతరం సీఎం కేసీఆర్ సింహనాదం చేశారు. ప్రజలిచ్చిన ఈ గెలుపు టీఆర్ఎస్ పాలనకు రెఫరెండం అని కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు బుద్ది తెచ్చుకోవాలని సూచించారు..
కేసీఆర్ మాట్లాడుతూ ఈ మధ్య పేపర్లలో బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడు లక్ష్మన్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నాడని.. ఈ కొత్త బిచ్చగాడు తెలంగాణ కు ఏం చేశాడో చెప్పాలని కేసీఆర్ మండిపడ్డారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణ ప్రాజెక్టుల్లో ఒక్కదానికి జాతీయ హోదా సాధించి చూపాలని సవాల్ విసిరారు.. కేసీఆర్ నోట కొత్త బిచ్చగాడు అని రావడం.. ఆయన లక్ష్మన్ పై చేసిన విమర్శలు.. ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి..
లక్ష్మన్ ఇటీవల బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన తర్వాత కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు. జిల్లాల్లో పర్యటిస్తూ కేసీఆర్ పాలన, కేంద్రబీజేపీ ప్రభుత్వం నిధులిస్తున్నా కేసీఆర్ దుబారా చేస్తున్నాడని విమర్శించారు. దీనిపై కేసీఆర్ గట్టిగా సమాధానమిచ్చారు. బీజేపీ కరువు కోసం 72 కోట్లు ఇస్తే తాము 350 కోట్లు ఖర్చు పెట్టామని కేసీఆర్ లెక్కలతో వివరించారు.