కొత్త జిల్లాల‌కు జిల్లా వైద్య‌శాల‌లు : మంత్రి ల‌క్ష్మారెడ్డి

స‌ర్కార్ ద‌వాఖానాకు వ‌చ్చే ప్ర‌తి రోగికీ
ఉచిత రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు, మందులు
మాతా శిశు సంర‌క్ష‌ణకు పెద్ద పీట‌
అమ్మ ఒడికి అధిక ప్రాధాన్యం
న్యూ బోర్న్ బేబీస్‌కి కిట్లు
ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో డెలివ‌రీల‌కు ప్రోత్సాహ‌కాలు
అన్ని ద‌వాఖానాల‌కు అందుబాటులో స‌ర్జిక‌ల్, క‌న్స్యూమ‌బుల్స్‌
కొత్త జిల్లాల‌కు జిల్లా వైద్య‌శాల‌లు
నిరేపేద‌ల కోసం మ‌రిన్ని 108, పార్థీవ వాహనాలు
వాస్త‌వావ‌స‌రాల ఆధారంగా ఆరోగ్య బ‌డ్జెట్ అంచ‌నాలు
ఉన్న‌తాధికారుల‌తో విభాగాల‌వారీగా స‌మీక్షించిన వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ ల‌క్ష్మారెడ్డి
హైద‌రాబాద్ : ఇక స‌ర్కార్ ద‌వాఖానాకు వ‌చ్చే ప్ర‌తి రోగికీ ఉచిత రోగ్య నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌తోపాటు, ఉచితంగానే అన్ని ర‌కాల మందులు అందే విధంగా చూడాల‌ని, అన్ని వైద్య‌శాల‌ల్లో ఆప‌రేష‌న్ థియేట‌ర్ల‌ను ఆధునీక‌రించి, అన్ని ర‌కాల స‌ర్జిక‌ల్‌, క‌న్స్యూమ‌బుల్ ప‌రిక‌రాల‌ను కూడా అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి. హైదరాబాద్ వెంగళరావు నగర్ లోని కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయంలో మంత్రి లక్ష్మారెడ్డి ఆరోగ్య శాఖ 2017-18 బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వివిధ శాఖ‌ల వారీగా బ‌డ్జెట్ అంచ‌నాల‌ను స‌మీక్షించారు. వాస్త‌వ అవ‌స‌రాలు, ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల‌కు పెరుగుతున్న ఓపీ, ఐపీల ఆధారంగా బ‌డ్జెట్ అవ‌స‌రాల‌ను గుర్తించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అలాగే బ‌డ్జెట్‌లో హై లైట్ చేయాల్సిన ప‌లు అంశాల‌ను వివ‌రిస్తూ, సంబంధిత అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు.
స‌ర్కార్ ద‌వాఖానాకు వ‌చ్చే ప్ర‌తి రోగికీ
ఉచిత రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు, మందులు
ఈ సంద‌ర్భంగా మంత్రి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ, సాధార‌ణంగా ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్‌కి నిరుపేద‌లే వ‌స్తుంటార‌న్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో పేద‌లు ప్ర‌భుత్వ ద‌వాఖానాల‌కు వ‌చ్చే సంఖ్య 20శాతం పెరిగింద‌న్నారు. గ‌త ఏడాది పెరిగిన ఓపి 5.8 కోట్లు, ఐపీ 20 లక్షల దృష్ట్యా  వాస్తవ అవసరాల ఆధారంగా విభాగాల వారీగా బడ్జెట్ అవసరాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు మంత్రి లక్ష్మారెడ్డి. అలాగే ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల్లో ఉచిత రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌డ‌మేగాక‌, ఉచితంగా అన్ని ర‌కాల‌ మందులు పంపిణీ జ‌రిగే దిశ‌గా ఆలోచించాల‌న్నారు. ప్ర‌తి రోగికి ఇవ‌న్నీ అందే విధంగా చూడాల‌ని ఆదేశించారు. ఇప్పుడు నిర్ణీత మందులు మాత్ర‌మే అందిస్తున్నామ‌ని, కొన్ని మందుల కోసం రోగులు ప్రైవేట్‌గా మందులు కొనుగోలు చేయాల్సి వ‌స్తున్న‌ద‌న్నారు. అలా కాకుండా మందుల‌న్నీ ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల్లోనే దొరికే విధంగా చూడాల‌ని చెప్పారు.
మాతా శిశు సంర‌క్ష‌ణకు పెద్ద పీట‌
అమ్మ ఒడికి అధిక ప్రాధాన్యం
మాతాశిశు సంక్షేమానికి సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ స‌ర్కార్ పెద్ద పీట వేస్తున్న‌ద‌న్నారు. త‌ల్లీ బిడ్డ‌ల సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ని పూర్తిగా ప్ర‌భుత్వ‌మే తీసుకోవాల‌న్నారు. ఇప్ప‌టికే గ‌ర్బిణీల‌ను గుర్తించ‌డం, వారికి నెల నెలా ప‌రీక్ష‌లు చేయించి పౌష్టికాహారం అందించ‌డం, ఉచితంగా ప్ర‌భుత్వ ద‌వాఖానాల్లోనే సుఖ ప్ర‌స‌వాలు చేయించ‌డం వంటివి జ‌రుగుతున్నాయ‌న్నారు. అయితే వీటిని మ‌రింత స‌మ‌ర్థ‌వంతం చేయాల‌ని సూచించారు మంత్రి ల‌క్ష్మారెడ్డి. అలాగే ఈ మ‌ధ్య కాలంలో చేప‌ట్టిన అమ్మ ఒడి కార్య‌క్ర‌మానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌న్నారు. 108 వాహ‌నం ద్వారా గ‌ర్బిణీని స‌ర్కార్ ద‌వాఖానాకు తీసుక‌వ‌చ్చాక‌, ప్ర‌స‌వానంత‌రం త‌ల్లీ బిడ్డ‌ల‌ను క్షేమంగా వారి ఇళ్ళ‌కు చేర్చే 102 వాహ‌నాల‌ను కూడా స‌మ‌ర్థ‌వంతంగా న‌డ‌పాల‌ని మంత్రి తెలిపారు.
న్యూ బోర్న్ బేబీస్‌కి కిట్లు
త్వ‌ర‌లోనే న్యూ బొర్న్ బేబీస్‌కి కిట్స్ ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. ఆయా కిట్స్‌లో పిల్ల‌ల‌కు అవ‌స‌ర‌మైన బేబీ సోప్‌, బేబీ ఆయిల్‌, దోమ తెర‌, డైప‌ర్స్‌, డ్రెస్ వంటి ప‌లు ర‌కాల వ‌స్తువులుంటాయ‌న్నారు. ఇప్ప‌టికే స‌ర్కార్ ద‌వాఖానాల్లో 2.50ల‌క్ష‌ల మంది ప్ర‌సూతి అవుతున్నార‌ని, వాళ్ళంద‌రికీ స‌ర‌ప‌డా బేబీ కిట్స్ ఇవ్వాల్సి ఉంటుంద‌ని మంత్రి వివ‌రించారు. ఇందుకు త‌గ్గ‌ట్లుగా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న చేయాల‌ని మంత్రి అధికారుల‌కు సూచించారు.
ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో డెలివ‌రీల‌కు ప్రోత్సాహ‌కాలు
స‌ర్కార్ ద‌వాఖానాల్లో డెలివ‌రీ అయ్యే వాళ్ళ‌కు ప్రోత్సాహ‌కాలు అందించాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ద‌న్నారు మంత్రి. ఆ ప్రోత్సాహ‌కం కాస్త త‌ల్లీ బిడ్డ‌ల‌కు అక్క‌ర‌కు వ‌చ్చే విధంగా, వారి క‌నీస అవ‌స‌రాలు తీరే విధంగా ఉండాల‌ని, అలాగే, నిరుపేద‌లు ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల్లోనే ప్ర‌సూతి అవ‌డానికి ఆక‌ర్షించే విధంగా ప్రోత్స‌హాకాలుంటాయ‌ని మంత్రి వివ‌రించారు. ఆయా ప్రోత్సాహ‌కాల‌ను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య బ‌డ్జెట్‌ని రూపొందించాల‌ని అధికారుల‌కు మంత్రి చెప్పారు.
అన్ని ద‌వాఖానాల‌కు అందుబాటులో స‌ర్జిక‌ల్, క‌న్స్యూమ‌బుల్స్‌
ఇక అన్ని ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్‌ని ఆధునీక‌రించ‌డ‌మేగాకుండా, ఆప‌రేష‌న్ థియేటర్ల‌ను ఆధునికంగా తీర్చిదిద్దాల‌ని మంత్రి చెప్పారు. స‌ర్వ స‌దుపాయాలు ఆప‌రేష‌న్ థియేట‌ర్ల‌లో ఉండాల‌న్నారు. స‌ర్జిక‌ల్స్‌తోపాటు, క‌న్స్యూమ‌బుల్స్ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయాల‌ని చెప్పారు. ఎలాంటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో రోగులు వ‌చ్చినా, సాధ్య‌మైనంత వ‌ర‌కు ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల్లోనే వారికి న‌య‌మ‌య్యే విధ‌మైన ఏర్పాట్లు ఉండాల‌ని మంత్రి చెప్పారు.
                                                    కొత్త జిల్లాల‌కు జిల్లా వైద్య‌శాల‌లు
ఈ మ‌ధ్య కాలంలో కొత్త జిల్లాల ఏర్ప‌డిన దృష్ట్యా, ఆయా జిల్లా కేంద్రాల్లో జిల్లా వైద్య‌శాల‌ల‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌తి జిల్లా కేంద్రంలో త‌ప్ప‌నిస‌రిగా ఒక జిల్లా స్థాయి స‌దుపాయాలతో కూడి హాస్పిట‌ల్ ఉండాల‌న్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో కొన్ని చోట్ల ఏరియా హాస్పిట‌ల్స్ ఉన్నాయ‌ని, వాటిని అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంద‌ని సూచించారు. అలా లేని చోట్ల స్థ‌లాలు గుర్తించ‌డం, పాత హాస్పిట‌ల్స్‌లో స్థ‌లం ఎక్కువ‌గా ఉంటే అక్క‌డే కొత్త భ‌వ‌నాలు క‌ట్ట‌డం అందుకు త‌గ్గ నిధుల విష‌య‌మై కూడా అధికారులు ఆలోచించాల‌ని మంత్రి ల‌క్ష్మారెడ్డి దిశానిర్దేశం చేశారు.
నిరేపేద‌ల కోసం మ‌రిన్ని 108, పార్థీవ వాహనాలు
ఇప్ప‌టికే నిరుపేద‌ల కోసం 108 వాహ‌నాలు ఉన్నాయ‌ని చెప్పారు. అయితే రోజురోజుకు పెరుగుతున్న ఐపి, ఓపీ పేషంట్ల‌కు త‌గ్గ‌ట్లుగా వాటిని పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అలాగే ఈ మ‌ధ్య కాలంలో ప్రారంభించిన పార్థీవ వాహ‌నాలు నిరుపేద‌ల‌కు అందుబాటులో ఉంటున్నాయ‌ని, వాటి సంఖ్య‌ను కూడా పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి చెప్పారు. ఆయా వాహ‌నాల పెంపున‌కు స‌రిప‌డా నిధుల‌ను స‌మ‌కూర్చుకునే విధంగా బడ్జెట్ అంచ‌నాల్లో చెప్పాల‌ని మంత్రి సూచించారు.
పూర్తి స్థాయి అంచ‌నాలతో అధికారులు వ‌స్తే, ఆయా నివేదిక‌ల‌ను సీఎం కెసిఆర్‌ దృష్టికి తీసుకెళ్ళి, వాటి ఆమోదం పొందాల్సి ఉంటుంద‌ని, ఈ లోగా అధికారులు వాస్తవ అవసరాల ఆధారంగా విభాగాల వారీగా బడ్జెట్ అవసరాలు గుర్తించాలని అధికారులను మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు.
ఈ బ‌డ్జెట్ స‌న్నాహాక సమావేశానికి మంత్రి ల‌క్ష్మారెడ్డితోపాటు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రాజేశ్వర్ తివారి, కుటుంబ సంక్షేమ, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వాకాటి కరుణ,ఆయుష్ కమిషనర్ డాక్ట‌ర్ రాజేందర్ రెడ్డి, హెల్త్ వర్శిటీ వీసీ డాక్ట‌ర్‌ కరుణాకర్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ డాక్ట‌ర్‌ మనోహర్, డిఎంఇ డాక్ట‌ర్ రమణి, డిహెచ్ డాక్ట‌ర్ లలితకుమారి, ఆరోగ్యశ్రీ ఇసిఓ చంద్రశేఖర్, ఆరోగ్య‌శ్రీ ఉద్యోగులు, జ‌ర్న‌లిస్టుల హెల్త్ స్కీముల సీఈఓ డాక్ట‌ర్ క‌ల్వ‌కుంట్ల‌ పద్మ, ఎంఎన్‌జె క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌ డైరెక్టర్ డాక్ట‌ర్‌ జయలత, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక స‌దుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ వేణుగోపాలరావు ఇతర ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

About The Author

Related posts