కొత్త‌గా ఏర్ప‌డ్డ తెలంగాణాకు మ‌రింత స‌హ‌కారం ఇవ్వాల‌ని కోరిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

కొత్త‌గా ఏర్ప‌డ్డ తెలంగాణాకు మ‌రింత స‌హ‌కారం ఇవ్వాల‌ని కోరిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

తెలంగాణాలో కేంద్ర ప‌థ‌కాల అమ‌లు బాగుంది

మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా గ్రామీణాభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టండి

కేంద్రం నుండి పూర్తి స‌హ‌కారం అందిస్తాం

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స‌హాయ మంత్రి రాంకృపాల్ యాద‌వ్‌

హ‌రిత‌హారంలో నాటిన‌ మొక్క‌ల మ‌నుగ‌డ రేటుపై సంతృప్తి

తెలంగాణాకు ఉపాధి ప‌నిదినాల‌ను, డీడీయూజీకేవై టార్గెట్‌ను

అద‌నంగా కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి

ప్ర‌తి జిల్లాకు క‌నీసం ఒక రూర్బ‌న్ క్ల‌స్ట‌ర్ కేటాయించాల‌ని

విన‌తి ప‌త్రం అంద‌జేత‌

టీ సిపార్డ్‌లో కేంద్ర ప‌థ‌కాల‌పై సుధీర్ఘ స‌మీక్ష‌

హైద‌రాబాద్‌: తెలంగాణాలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్య‌క్ర‌మాల అమ‌లు బాగుంద‌ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స‌హాయ మంత్రి రాంకృపాల్ యాద‌వ్ ప్ర‌శంసించారు. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న వివిధ కేంద్ర పథ‌కాల‌పై మంత్రి జూప‌ల్లి కృష్ణారావుతో క‌లిసి రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని టీ సిపార్డ్ (తెలంగాణా రాష్ట్ర పంచాయ‌తీరాజ్ మ‌రియు గ్రామీణాభివృద్ధి సంస్థ‌)లో సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణాలో అమ‌లు చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల పురోగ‌తిని ప‌వ‌ర్ పాయింట్ ప్రెసెంటేష‌న్ ద్వారా అధికారులు వివ‌రించారు. ఉపాధి హామీ, పీయం జీఎస్‌వై, రూర్బ‌న్‌, డీడీయూజీకేవై, టీఆర్ ఐ జీపీ, పింఛ‌న్ల పంపిణీ త‌దిత‌ర అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర స‌హాయ మంత్రి రాంకృపాల్ యాద‌వ్ మాట్లాడుతూ… తెలంగాణాలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్య‌క్ర‌మాల అమ‌లు బాగుంద‌ని…మ‌రింత ఉత్సాహంగా ప‌నిచేయాల‌న్నారు. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌తి ఒక్క‌రికి అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఆ దిశ‌గా ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ సిద్దం చేసుకొని ముందుకు పోవాల‌ని సూచించారు. హ‌రిత హారంలో భాగంగా నాటిన మొక్క‌ల మ‌నుగ‌డ రేటు 70 శాతం వ‌ర‌కు ఉండ‌టంపై కేంద్ర మంత్రి సంతృప్తి వ్య‌క్తం చేశారు. మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మాట్లాడుతూ…దేశానికే ఆద‌ర్శంగా గ్రామీణాభివృద్ధి శాఖ‌ను మార్చేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని…కేంద్రం నుండి మ‌రింత స‌హ‌కారం అంద‌జేయాల‌ని కోరారు. పెద్ద ఎత్తున ఉపాధి హామీని అమ‌లు చేస్తున్నామ‌ని…ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో మొద‌ట్లో ఇచ్చిన 8 కోట్ల ప‌నిదినాల ల‌క్ష్యాన్ని కూడా ఇప్ప‌టికే అధిగ‌మించామ‌న్నారు.

jupally krishna rao 1

ఈ ల‌క్ష్యాన్ని 16 కోట్ల‌కు పెంచాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే 750 కోట్ల మెటీరియ‌ల్ కాంపోనెంట్ చెల్లించాల్సి ఉంద‌ని…దానిని కూడా విడుద‌ల చేసేట్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. తెలంగాణాలో తీసుకువ‌చ్చిన నూత‌న పారిశ్రామిక విధానం ద్వార పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలు ఏర్ప‌డుతున్నాయ‌ని… వీటిని అందిపుచ్చుకునే విధంగా దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశ‌ల్య యోజ‌న కింద యువ‌త‌కు పెద్ద ఎత్తున శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. 2019 వ‌ర‌కు 47 వేల మందికి శిక్ష‌ణను ల‌క్ష్యంగా కేంద్రం ఇచ్చింద‌ని.. దీనిని మ‌రింత పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అలాగే 2003-04లో జ‌రిగిన పొర‌పాటు నివేధిక వ‌ల్ల రాష్ట్రానికి ప్ర‌ధాన మంత్రి గ్రామీణ స‌డ‌క్ యోజ‌న కింద రావాల్సిన 1230 కిలో మీట‌ర్ల ర‌హ‌దారుల‌ను మంజూరు చేయ‌లేద‌న్నారు. దీనిపై ఇప్ప‌టికే కేంద్ర బృందాలు క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి నివేధిక కూడా ఇచ్చాయ‌ని.. దీనికి సంబంధించి 800 కోట్ల రూపాయ‌ల విలువైన ర‌హ‌దారుల నిర్మాణానికి పీయం జీఎస్‌వై – 2 కింద అనుమ‌తి ఇవ్వాల‌ని కోరారు. అలాగే రాష్ట్రానికి మూడు విడుత‌ల్లో 16 రూర్బ‌న్ క్ల‌స్ట‌ర్ల‌ను మంజూరు చేశార‌ని…కనీసం జిల్లాకు ఒక్క‌టైన ఇవ్వాల‌ని కేంద్ర స‌హాయ మంత్రి రాంకృపాల్ యాద‌వ్‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు విన‌తి ప‌త్రం అంద‌జేశారు. స‌మీక్ష‌లో పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి వికాస్ రాజ్‌, క‌మిష‌న‌ర్ నీతూ ప్ర‌సాద్‌, సెర్ప్ సీఈఓ పౌస‌మి బ‌సు, ఈ ఎన్ సీ స‌త్య‌నారాయ‌ణ‌రెడ్డి, స్త్రీ నిధి ఎండీ విద్యాసాగ‌ర్ రెడ్డి, సెర్ప్ డైరెక్ట‌ర్లు వెంక‌టేశ్వ‌ర్లు, బాల‌య్య‌,  సైదులు, ఆశా త‌దిత‌రులు పాల్గొన్నారు.

jupally krishna rao 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *