
సీఎం కేసీఆర్ తన కొడుకు , మంత్రి కేటీఆర్ కోరికను కాదనలేక పోతున్నాడు. అందుకే ఇంత వరకు ప్రస్తావనే లేకున్నా ఏకంగా సిరిసిల్లను జిల్లాగా చేయడానికి నిర్ణయించారు. తెలంగాణలో కొత్త జిల్లాలపై కార్యచరణ రూపొందుతున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా ఇంతవరకు ప్రతిపాదనే లేకున్నా.. కేటీఆర్ కోరిక, ఆయన నియోజకవర్గమైన సిరిసిల్లను జిల్లా చేస్తే రాజకీయంగా కేటీఆర్ కు తిరుగుండదు అన్న ఉద్దేశంతో సిరిసిల్ల ను జిల్లా చేయాలని కేసీఆర్ ను నిర్ణయించినట్టు సమాచారం.
తెలంగాణలో ఈ దసరా వరకు కొత్త జిల్లాలు ఏర్పడతాయని కేసీఆర్ ప్రకటించారు.. కలెక్టర్లతో సుధీర్ఘంగా రెండు రోజుల పాటు హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. జూన్ 20 నాటికి కలెక్టర్లందరూ తుది నివేదికలు అందజేయాలని సూచించారు. ఇప్పటికే రంగారెడ్డి, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. ఇక జూన్ లో జిల్లాల తుది రూపు కొలిక్కి వచ్చి జూలైలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇందులో రాజకీయ, ప్రజాసంఘాల నాయకులతో జిల్లాలపై అభ్యంతరాలు , సూచనలు స్వీకరిస్తారు. అనంతరం ఆగస్టులో జిల్లాలపై ముసాయిదాను విడుదల చేస్తారు. నెల పాటు దీనిపై ప్రజలు, నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ జరిగి అనంతరం సెప్టెంబర్ లో తుది జిల్లాలను ప్రకటిస్తారు. కొత్త జిల్లాలపై కార్యచరణ ప్రణాళిక పూర్తయి ప్రకటన వెలువడగానే.. దసరా నుంచి (అక్టోబర్ 11) నుంచి తెలంగాణలో కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయి..