కేసీఆర్ తీరుపై మంత్రులు, నాయకుల గుస్స

హైదరాబాద్, ప్రతినిధి : టీఆర్ఎస్‌లో మంత్రివర్గ విస్తరణ చిచ్చు మొదలైంది. గులాబీ దళపతి తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. నిన్న మొన్నటి వరకు సీఎం ఎక్కడుంటే అక్కడ కనిపించే సీనియర్లు ఇప్పుడు సచివాలయం దిక్కు చూడటం లేదు. పదవులు ఆశించి భంగపడ్డ కొప్పుల ఈశ్వర్, కొండా సురేఖ, ఏనుగు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌ కొత్తమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సైతం డుమ్మాకొట్టి అసంతృప్తిని వ్యక్తం చేశారు.

సమైక్యవాదులకు మంత్రి పదవులిచ్చి….
రాజధానిపై రెఫరెండం పెట్టి యూటీ చేయాలన్న తలసాని, ఏనాడు జై తెలంగాణ అనని తుమ్మల, సమైక్యవాది జగన్‌కు వెన్నుదన్నుగా ఉన్న ఇంద్రకరణ్‌లను మంత్రులుగా చేయటాన్ని తెలంగాణవాదులు తప్పుబడుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవి కోసం… ఉద్యమ లక్ష్యాలను పక్కన పెడతారా..? అని ప్రశ్నిస్తున్నారు. సమైక్యవాదులకు మంత్రి పదవులిచ్చి… సమైక్య వాదిగా మారుతున్న కేసీఆర్‌కు… తెలంగాణ ప్రజలే బుద్ది చెబుతారని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

పాత మంత్రుల్లో సన్నగిల్లుతున్న ఉత్సాహం….
మరోవైపు కొత్త మంత్రుల చేరికతో పాత మంత్రుల్లో ఉత్సాహం సన్నగిల్లింది. కేసీఆర్ వెన్నంటే ఉండే పోచారం, హరీష్‌ రావు, ఈటెల, జోగు రామన్నలు సడన్‌గా సైలెంట్ అయిపోయారు. చట్టసభల్లో సభ్యుడు కానీ తుమ్మలకు… ఆర్ అండ్ బీ శాఖ కట్టబెట్టడం పట్ల గుర్రుగా ఉన్నారు. తమకంటే ఆయనకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందన్న అభిప్రాయంలో ఉన్నారు. కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు మంత్రివర్గ విషయాలను ఇప్పటి వరకు కేసీఆరే మీడియాకు వెల్లడించేవారు. ఆయన కాకుండా మరేమంత్రి మీడియా ముందుకు వచ్చేందుకు సాహసించలేదు. అలాంటిది కేబినెట్‌లో చేరిన మొదటి రోజే తుమ్మల మంత్రివర్గ సమావేశ వివరాలను భ్రీఫ్ చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు.

అసహనంతో కార్యకర్తలు…
ఇక టీఆర్ఎస్‌ కార్యకర్తలైతే అసహనంతో రగిలిపోతున్నారు. తెలంగాణలో రాజకీయాలకు అర్థం మారిపోయిందని బాధ పడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో… పార్టీ కోసం పనిచేసిన సైనికులు కేసీఆర్ దృష్టిలో ద్రోహులయ్యారని… తెలంగాణకు అడ్డుపడిన నేతలే వీరులై… మంత్రి పదవులు దక్కించుకున్నారని మండిపడుతున్నారు. దశాబ్దాల ఉద్యమంలో పది నిమిషాలు పనిచెయ్యని నేతలు… బుగ్గ కార్లలో తిరిగితే అమరుల ఆత్మఘోషిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో విమర్శలు….
అటు కేసీఆర్ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీని పొగడ్తలతో ముంచెత్తడాన్ని తప్పుబడుతున్నారు. నాడు రామోజీ ఫిల్మ్‌ సిటీ భూముల్ని… లక్ష నాగళ్లతో దున్నుతామన్న కేసీఆర్… ఇప్పడు మాటేందుకు మార్చారని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విమర్శలను కేసీఆర్ ఆండ్ టీం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.