కేసీఆర్, జగన్ లకు అగ్ని పరీక్ష

నవ్యాంధ్ర రాజధాని శంకుస్థాపన కోసం ఓ వైపు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందమైన ఆహ్వాన పత్రికలు సిద్ధమయ్యాయి. వాటిని పంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తానని ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కూడా ఆహ్వానిస్తానన్నారు.మరి వీరిద్దరూ ఆ కార్యక్రమానికి హాజరవుతారా అనేది చర్చనీయాంశమైంది. వారి రాజకీయ పరిణతికి ఇది పరీక్షా సమయం వంటిది. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి, పొరుగు రాష్ట్ర రాజధాని శంకుస్థాపనను ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిపించే కార్యక్రమానికి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయిస్తే అది సత్ సంప్రదాయం అవుతుంది. మంచి సంకేతాన్ని ఇచ్చినట్టవుతుంది. ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలూ అభవృద్ధిలో పోటీపడుతూ సోదరభావంతో ముందుకు పోతే అందరికీ మంచిది. ఈ విషయంలో చంద్రబాబు చొరవ తీసుకుని, స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానించాలని నిర్ణయించడం విశేషం. ఈ ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించి హాజరవుతారా లేదా చూడాలి.ఏపీలో ప్రధాన ప్రతిపక్ష అధ్యక్షుడు శంకుస్థాపనకు హాజరు కాకపోతే అది సబబు అనిపించుకోదు. రేపో మాపో జగన్ దీక్షను పోలీసులు భగ్నం చేస్తారు. తర్వాత కాస్త నీరసనం నుంచి కోలుకుని శంకుస్థాపనకు హాజరు కావడానికి తగినంత సమయం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు స్వయంగా ఆహ్వానిస్తే జగన్ ఏంచేస్తారనేది వేచి చూడాలి.ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సోదర భావంతో ఒకే వేదికపై కనిపించడం ఎన్నో రకాలుగా సరైన సంకేతాలను పంపుతుంది. ఐకమత్యమే మహాబలం అన్నట్టు, అదే రెండు రాష్ట్రాలకు కేంద్రం నుంచి తగిన నిధులు, ప్రాజెక్టులు సాధించడానికి ఉపయోగపడవచ్చు. ఈ కీలక సమయంలో కేసీఆర్, జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *