
తెలంగాణ అమరవీరుల బలిదానాలను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. అందరినీ మోసం చేశారని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంటుతో టీఆర్ఎస్ మనుగడ సాగిస్తోందని.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితోనైనా కేసీఆర్, హరీష్ రావు మారి ప్రజల కష్టాలను తీర్చాలని సూచించారు.
తెలంగాణ వ్యతిరేకులను, తెలంగాణను అడ్డుకున్న నాయకులకు మంత్రిపదవులు, నామినేటెడ్, కార్యదర్శలు పదవులిస్తున్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులను మోసం చేశారని మండిపడ్డారు. తలసాని, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు ఏనాడు తెలంగాణ కోసం పోరాడలేదని .. వారిని అందలం ఎక్కించిన ఘనత కేసీఆర్ దేనన్నారు. ఇప్పుడిప్పుడే కేసీఆర్ నైజం బయటపడిందని.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం ఆయన పార్టీని ఓడించారని.. మున్ముందు టీఆర్ఎస్ పై తిరుగుబాటు తప్పదని విమర్శించారు.