కేసీఆర్… ఇదేంది సార్?

బంగారు తెలంగాణ సాధిస్తానంటున్న కేసీఆర్, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా విషయంలో మాత్రం తరచూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. సచివాలయంలోకి మీడియాను అనుమతించకూడదని నిర్ణయించారు. దీనికి కొన్ని కారణాలు చెప్తున్నారు. అధికారులు కూడా మీడియాను అనుమతించక పోవడమే మంచిదని నివేదించారట.

మీడియా ప్రతినిధుల సమావేశానికి పిలవాల్సిన యూనియన్ల విషయంలోనూ వివాదాస్పద వైఖరే. భారత దేశంలో ఒక విధంగా సాధికారిక జర్నలిస్టుల యూనియన్ ఐ జె యు. దాని అనుబంధ సంస్థ మొన్నటి వరకు ఎ పి యు డబ్ల్యు జె. ఇప్పుడు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్. కానీ ప్రభుత్వం మాత్రం ఈమధ్య ఆవిర్భవించిన తెలంగాణ జర్నలిస్తు ఫోరం ను మాత్రమే సమావేశాలకు పిలుస్తోంది. అదే అధికారిక యూనియన్ అన్నట్టు భావిస్తోంది. తమకు అనుకూలమైన యూనియన్ ను పిలిస్తే పిలవ వచ్చు. కానీ పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న యూనియన్ ను విస్మరించడమే ఆశ్చర్యకరం.

ఈ యూనియన్ లోని తెలంగాణ జర్నలిస్టులందరూ దాదాపు గా ఉద్యమంలో పాల్గొన్నవారే. ఎన్నో విధాలుగా తెలంగాణ సాధన కోసం పోరాడిన వారే. కాకపోతే అధికార పార్టీకి అనుంగు సంస్థగా కాకుండా, జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రయత్నించే యూనియన్. అవసరమైతే ప్రభుత్వాన్ని ఎదిరించైనా జర్నలిస్టుల హక్కులను కాపాడటానికి ప్రయత్నిస్తుంది.

సచివాలయంలో కొందరు జర్నలిస్టులు న్యూసెన్స్ చేస్తున్నారనేది ప్రధానంగా కొందరు అధికారులు, ఇతర అనుచరుల అభిప్రాయం అని వార్తలు వస్తున్నాయి. సరే, ఎక్కడైనా లోపాలు ఉండొచ్చు. వాటికి పరిష్కారం ఏమిటో ఆలోచించాలి. టీఆరెస్ లో అందరూ హుందాగా వ్యవహరించే వారే ఉండరు. కొందరు న్యూసెన్స్ చేసే వారు, అనుచితంగా ప్రవర్తించే వారు ఉండొచ్చు. వారిని పార్టీనుంచి బహిష్కరించడం, అసలు సచివాలయానికి రాకుండా నిషేధించడం వంటివి చేస్తున్నారా? ఇలాంటి వారి గురించి కేసీఆర్ కు తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండమని సూచిస్తారు లేదా హెచ్చరిస్తారు. కొందరు జర్నలిస్టుల విషయంలోనూ అలాగే చేయవచ్చు.

అంతేగానీ మొత్తం జర్నలిస్టులందరినీ సచివాలయంలోకి రాకుండా ఆంక్షలు విధించడం ఆశ్చర్యకరం. పైగా అతిపెద్ద యూనియన్ ను విస్మరించి, ప్రత్యేక యూనియన్ గా ఒకదానికి ప్రాధాన్యం ఇవ్వడం ఎలా ప్రజాస్వామికం అవుతుందో ముఖ్యమంత్రిగారే చెప్పాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *