కేంద్ర సచివాలయ సేవల విభాగం నుంచి వచ్చిన అధికారుల బృందంతో సమావేశమైన వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారథి

సోమవారం  తెలంగాణ సచివాలయం హైదరాబాదులోని సమావేశ మందిరంలో వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి. పార్థసారధి, ఐ.ఎ.ఎస్., కేంద్ర సచివాలయ సేవల విభాగం నుంచి వచ్చిన అధికారుల బృందంతో సమావేశమయ్యారు. వారికి తెలంగాణ వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, అవి అమలు చేస్తున్న తీరు గురించి వివరించారు. తెలంగాణ నేలలు, శీతోష్ణ స్థితులు, వైవిధ్య భరితమైన పంటల సాగు గురించి వివరించారు. ప్రధానంగా వర్షాధార వ్యవసాయంగా ఉండడం, అప్పడప్పుడు వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, కూలి ఖర్చులు, సాగునీటి సమస్యలు మొదలగు అంశాల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తదనుగుణమైన ప్రణాళికలు రూపొందించి ముందుకు సాగుతోందని అన్నారు. అందులో భాగంగా రైతులకు 16,124.38 కోట్ల రుణ మాఫీ (4 విడతలుగా) చేసిందన్నారు. నిరంతర ఉచిత విద్యుత్తును అందిస్తోందని అన్నారు. 4.86 లక్షల ఎకరాల్లో సూక్ష్మ నీటిపారుదలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కూలీల కొరతను అధిగమించడంలో భాగంగా గత నాలుగేళ్ళలో వ్యవసాయ యాంత్రీకరణపై 586.16 కోట్ల రూపాయలు వెచ్చిందన్నారు. పంటలను సరియైన పద్ధతిలో నిల్వ చేసుకోవడానికి గోదాములను నిర్మించ్చిందని చెప్పారు. తెలంగాణను దేశానికే విత్తన భాండాగారంగా నిలిపే దిశగా ఆచరణలో ముందుకు సాగుతోందని అన్నారు. వ్యవసాయ ఉత్పాదకాలను సకాలంలో రైతులకు అందేలా చర్యలు తీసుకుందని చెప్పారు. పండించిన పంట కొనుగోలుకు ఈ-నామ్ తో సహా అనేక మార్కెటింగా సంస్కరణలు చేపట్టిందని అన్నారు. సాగు నీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మేజర్, మీడియం, మైనర్ నీటిపారుదల ప్రాజెక్టుల ఏటా 25 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడమే కాక యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని చెప్పారు. 2018 ఖరీఫ్ నుంచి రైతులకు రైతుబంధు పేరిట అందించనున్న సాగుకి పెట్టుబడి పథకం గురించి వివరించారు. ప్రతి ఎకరా సాగుకు ఖరీఫ్ లో రు.4 వేల రూపాయలు రబీలో రూ.4 వేల రూపాయలు మొత్తంగా రెండు పంటలకు గాను ఎకరాకు 8 వేల సహకారాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఈ సహకారం వ్యవసాయ, ఉద్యాన పంటలన్నింటికి వర్తిస్తుందని అన్నారు. రైతులను వడ్డీ వ్యాపారుల బారి నుంచి కాపాడడానికి రైతులకు వెన్నుదన్నుగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించందన్నారు. సాగుకు అందించనున్న పెట్టుబడి సహకారంతో రైతుల సకాలంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, అవసరమయిన ఉత్పాదకాలు కొనుక్కోవడమే కాకుండా పంటల బీమా ప్రీమియం కూడా చెల్లించడానికి దోహదపడుతుందని అన్నారు. ఈ పథకాన్ని పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ పథకాన్ని ఇతర పాలనా సౌలభ్యం కోసం రైతుల భూముల వివరాలను, రికార్డులను ప్రక్షాళణ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే రైతులకు అందించాల్సిన చెక్కుల ముద్రణ చాలా వరకు పూర్తైనట్లు చెప్పారు. అలాగే వ్యవసాయ ముఖ్య కార్యదర్శి కేంద్రం సహకారంతోను, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగాను అమలు చేస్తున్న వివిధ వ్యవసాయ పథకాలను వివరించారు. కేంద్ర సచివాలయ సేవల విభాగపు ప్రతినిధుల బృందం అడిగిన పలు ప్రశ్నలకు వ్యవసాయ ముఖ్య కార్యదర్శి వివరణ ఇచ్చారు. వ్యవసాయ అధికారులు వివిధ అంశాలపై స్లైడ్ షో ద్వారా వివరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, ఐ.ఎ.ఎస్., ఉద్యాన కమిషనర్ ఎల్. వెంకట్రామి రెడ్డి, మార్కెటింగ్ సంచాలకులు లక్ష్మీబాయి, వ్యవసాయ అదనపు సంచాలకులు-1 జి. నారీమణి, సంయుక్త సంచాలకులు ఎస్. బాలూనాయక్ సహా
వ్యవసాయ, ఉద్యాన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *