
ఢిల్లీ, ప్రతినిధి : ఎంసెట్ వివాదం దేశరాజధానికి చేరింది. గవర్నర్‌తో భేటీలోనూ సమస్య కొలిక్కి రాకపోవడంతో ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు పంచాయితీని హస్తినలో పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు హాజరైన ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జగదీష్‌రెడ్డి ఎంసెట్ వ్యవహారాన్ని స్మృతి ఇరానీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
టీఎస్ సర్కార్ పై గంటా ఫైర్
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టానికి తూట్లు పొడుస్తోందని ఎపి మంత్రి గంటా శ్రీనివాస్ రావు అన్నారు. కావాలనే టీఎస్ సర్కార్ సమస్యను జటిలం చేస్తోందని విమర్శించారు. గవర్నర్ సూచనలను సైతం పక్కన పెట్టి వితండవాదం చేస్తోందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు. కేంద్రం చెప్పినా సమస్య పరిష్కారం కాకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
ఏపీ తీరుపై టీఎస్.సర్కార్ అగ్రహం
పునర్విభజన చట్టం ప్రకారం ఎంసెట్ నిర్వహించే హక్కు తెలంగాణాకే ఉందని విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఏకపక్షంగా ఎంసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిందన్నారు. సమస్యను పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉన్నామన్నారు. ఏపీ ప్రభుత్వం కోరితే ఎంసెట్‌ను ఉమ్మడిగా నిర్వహించేందుకు సహకరిస్తామన్నారు.
ఆందోళనలో విద్యార్థులు
కేంద్రం జోక్యంతోనైనా ఎంసెట్ వ్యవహారానికి తెరపడతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇలా గొడవలతో తమ భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇలా చీటికి మాటికి గొడవ పడకుండా శాశ్వత పరిష్కారం చేసుకోవాలని అంటున్నారు.