
హైదరాబాద్ : ‘నిధుల సమీకరణ’పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇందుకు కేంద్రం సహాయం తీసుకోనుంది. దీనికోసం మంత్రి ఈటెల ఢిల్లీకి పయనమౌతున్నారు. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీకి దీనిపై నివేదిక అందించనున్నారు. నిబంధనల ప్రకారం కేంద్రం నుండి అప్పు తెచ్చుకునే అంశాలపై దృష్టి సారించింది. కేంద్రం నుంచి అప్పు తెచ్చుకునేందుకు ఫిస్కల్ రెస్పాన్సిబులిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్‌మెంట్ చట్టం నుండి మినహాయింపు ఇవ్వాలని.. కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది.
9వేల కోట్ల అప్పు..
కేంద్రం నుంచి 9 వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశముంది. అయితే ఇప్పటివరకు 5 వేల కోట్లు మాత్రమే అప్పుగా తెచ్చుకుంది.. ఇంకా 4 వేల కోట్లు అప్పుగా తెచ్చుకునే అవకాశం ఉంది. దీనికోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయనుంది. కేంద్రం అమ్మకపు పన్ను వాటాను 3 శాతం నుండి 2 శాతానికి తగ్గించిన నేపథ్యంలో.. రాష్ట్రానికి రావాల్సిన 5 వేల 600 కోట్ల ఆదాయానికి గండిపడింది. దీనిని విడుదల చేయాలని కేంద్రాన్ని ఈటెల కోరతారని అధికారులంటున్నారు. అయితే అప్పులు ఏ రాష్ట్రానికైనా గుదిబండలాంటివని.. అవగాహన, అంచనా లేకుండా అప్పులు చేయడం వల్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోవడమే గాకుండా భవిష్యత్‌లో వారిపై భారం పడే అవకాశముందని పలువురు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీ..
కేంద్ర వార్షిక బడ్జెట్ రూపకల్పనకు ముందు వివిధ రాష్ట్రాల ఆర్ధిక మంత్రులతో భేటీ కావాలని కేంద్ర ఆర్ధికమంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటెల పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలకు సంబంధించిన అంశాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. మోడీ ప్రభుత్వం రూపొందించిన ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదంలో భాగంగా దేశీయ ఉత్పత్తిరంగానికి అధిక ప్రాధాన్యతివ్వనున్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులను నియంత్రించడం వల్లనే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.