కృష్ణ పట్నంపై ముదిరిన పంచాయతీ

హైదరాబాద్, ప్రతినిధి : భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుండి ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తూనే ఉన్నాయి. నీటి పంపకాలు..విద్యుత్..ఇలా ఎన్నో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చాయి. తాజాగా విద్యుత్ ఉత్పత్తిపై వివాదం నెలకొంది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్ పై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంపై ఇరు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం..
కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం. రాష్ట్ర విభజనకు ముందు ఏపీ జెన్‌కో, ట్రాన్స్ కోలు నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పాయి. తొలుత 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యంగా ఈ యూనిట్‌ను నిర్మించారు. అయితే ఆ తర్వాత మరో యూనిట్‌ను ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి చేర్చింది. ఈ రెండు యూనిట్లలో 1600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానుంది. అయితే ఇప్పటివరకు కృష్ణపట్నం తొలియూనిట్‌లో ప్రయోగాత్మకంగా విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఈ నెలాఖరులోగా వాణిజ్యపరంగా 800 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని అధికారులంటున్నారు.

విద్యుత్ ఉత్పత్తిపై భిన్న స్వరాలు..
అయితే కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌పై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ వినియోగంపై ఎవరికి వారు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను పూర్తిగా ఏపీ ప్రభుత్వమే వాడుకుంటుండగా.. అందుబాటులోకి రానున్న వాణిజ్యపరమైన విద్యుత్‌ ఉత్పత్తిని ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది.

మాకు అధికారాలు ఉన్నాయంటున్న ఏపీ..
ఇదిలా ఉంటే భౌగోళిక హక్కుల ప్రకారం కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై పూర్తి అధికారాలు తమకే ఉంటాయని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. గతంలో జారీ చేసిన జీవో ప్రకారం విద్యుత్‌ తమకే వర్తిస్తోందని ఏపీ విద్యుత్‌ అధికారులంటున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో తెలంగాణకు వాటా ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
అవసరాకనుగుణంగా విద్యుత్ కేటాయింపులు ఉండాలంటున్న నిపుణులు..
అయితే కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై జరుగుతున్న వివాదాన్ని నిపుణులు తప్పుపడుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఇరురాష్ట్రాల అవసరాలకనుగుణంగా వినియోగించుకోవాలంటున్నారు. కృష్ణపట్నం థర్మల్‌ కేంద్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు కాబట్టి ఇరు రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ కేటాయింపులు జరగాలంటున్నారు.

బోర్డు ఎలా నిర్ణయం తీసుకొనబోతుందో ?
మొత్తానికి కృష్ణపట్నం థర్మల్‌ ప్రాజెక్టుపై ఇరురాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సమస్యను పరిష్కరించేందుకు బోర్డు ఇరు రాష్ట్రాల విద్యుత్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఈ వివాదం పరిష్కారానికి బోర్డు తీసుకునే నిర్ణయం కీలకంగా మారబోతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.