కృష్ణా పంపకం తమ పరిధిలోనిది కాదన్న నిపుణుల కమిటీ

తెలంగాణ మైనర్ ఇరిగేషన్ వివరాలు కావాలన్న బజాజ్.

అభ్యంతరం తెలిపిన టిఎస్.

పోలవరం, పట్టి సీమలపై కేంద్రంతో సంప్రదిస్తామన్న కమిటీ .

శుక్రవారం ఢిల్లీ వెడుతున్న సలహాదారు విద్యాసాగరరావు .

‘ఉత్తుత్తి’ కమిటీ గా మారుతుందేమోనన్న టి. ఎస్.

—————

ఉభయ తెలుగు రాష్ట్రాలలో బజాజ్ కమిటీ మూడు రోజుల పర్యటన బుధవారం ముగిసింది. సోమవారం తెలంగాణ వాదనలు, అభిప్రాయాలు విన్న కమిటీ మంగళవారం విజయవాడలో ఎపి వాదనలు విన్నది. బుధవారం ఇక్కడ ‘జలసౌధ ‘లో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ముగింపు సమావేశం జరిపారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల మిగులు కృష్ణా నీటి వాటాను రెండు రాష్ట్రాల మధ్య తేల్చడం తమ పరిధిలోని వ్యవహారం కాదని బజాజ్ కమిటీ సృష్టం చేసింది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన బజాజ్ సారధ్యంలోని నిపుణుల కమిటీ విధివిధానాలలో ఈ అంశం ఉందని టి. ఎస్. ప్రభుత్వ సలహాదారు , సి.డబ్ల్యు.సి రిటైర్డు సిఇ ఆర్. విద్యాసాగరరావు గుర్తు చేశారు. ఆయనతో పాటు ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ ఎస్.కె. జోషి తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాన్ని మరోసారి క్లుప్తంగా వివరించారు. సోమవారం నాటి తొలి సమావేశంలో పట్టిసీమ, పోలవరంలలో వాటా తేల్చే అంశమూ విధి విధానాలలో ఉందన్న బజాజ్ కమిటీ విజయవాడ నుంచి రాగానే మాట మార్చిందని విద్యాసాగరరావు విమర్శించారు.పోలవరం నుంచి కృష్ణాలో తెలంగాణకు 96 శాతం వాటా కావాలని టి.ఎస్ కోరింది. పోలవరం ద్వారా గోదావరి నీటిని కు మళ్ళిస్తున్నందున మిగులు కృష్ణా జలాలలో ఉమ్మడి ఎపికి 45 టిఎంసీలు కేటాయించారని, వాటిని నాగార్జునసాగర్ ఎగువ భాగాన, కృష్ణా పరీవాహక ప్రాంతంలోనే వాడవలసి ఉన్నందున సింహభాగం 96 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని టిఎస్ పట్టుబట్టింది. పట్టిసీమలోను తెలంగాణకు 65 శాతం , ఎపి కి 35 శాతం వాటాలు కేటాయించాలని వాదించింది.. వాటాల కేటాయింపు వ్యవహారం ట్రిబ్యునల్ పరిధిలోనిదని బజాజ్ కమిటీ తేల్చి చెప్పడం విడ్డూరంగా ఉన్నదని టిఎస్ అభిప్రాయ పడింది. పైగా తెలంగాణలో చిన్న నీటి వనరులకు సంబంధించిన సమాచారం కోసం బజాజ్ కమిటీ ఉత్సాహం ప్రదర్శించడం పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలిపింది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా ఏ మేరకు గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లిస్తున్నారో ఎపి నుంచి వివరాలు సేకరించడంలో నిపుణుల కమిటీ విఫలమైందని విద్యాసాగరరావు అన్నారు. కృష్ణా నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ ఖరారు చేయడానికి చాలా సమయం పడుతున్నందున ఈలోగా తాత్కాలిక ప్రాతిపదికన నీటి వాడకంపై ఏర్పాట్లు జరగాలని టి. ఎస్. పట్టుబట్టింది. తెలంగాణ అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని బజాజ్ కమిటీ తెలిపింది. తన విధి విధానాలకు భిన్నంగా కమిటీ వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ప్రభుత్వ సలహాదారు విద్యాసాగరరావు మీడియా సమావేశంలో అభిప్రాయ పడ్డారు. శుక్రవారం తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ దృష్టికి బజాజ్ కమిటీ పర్యటన వివరాలు తీసుకు వెళతానని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాడకంలో సుహృద్భావ వాతావరణం, పరస్పర సహకారం, నిర్మాణాత్మక తోడ్పాటు లేకపోతే సమస్యలు మరింత జటిలమవుతాయని స్పెషల్ సిఎస్ జోషి బజాజ్ కమిటీ కి సూచించారు. ఉమ్మడి ప్రాజక్టులకు సంబంధించిన నిర్వచనాన్ని మళ్లీ ఖరారు చేయాలని ఆయన ప్రతిపాదించారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *