
– దక్కని మంత్రిపదవి -చీఫ్ విప్ ఖరారు
– అన్యాయం జరిగిందంటూ కుమిలిపోతున్న కొప్పుల అనుచరగణం
కరీంనగర్,ప్రతినిధి : టీఆర్ఎస్ పుట్టుక నుంచి పార్టీకి సేవలందిస్తూ ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కు అన్యాయం జరిగింది. కేసీఆర్ తో పాటు 13 ఏళ్ల ఉద్యమంలో ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉద్యమ చేదోడుగా ఉన్న ఈశ్వర్ కు మంత్రివర్గ విస్తరణలో మొండిచెయ్యే ఎదురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ తర్వాత కొప్పులే డిప్యూటీ సీఎం అవుతారని అంతా ఊహించారు. కానీ కులాల సమీకరణలో పాపం కొప్పుల ఈశ్వర్ కు డిప్యూటీ సీఎం పదవి కాదుకదా.. కనీసం మంత్రి పదవి కూడా లభించలేదు. తెలంగాణ లో అత్యధికంగా ఉన్న మాదిగ సామాజిక వర్గం ముందు అల్పసంఖ్యలో ఉన్న మాల సామాజిక వర్గానికి చెందిన కొప్పులకు తెలంగాణ మొదటి మంత్రివర్గంలో చోటు లభించలేదు. కుల సమీకరణాల్లో మాదిగ సామాజిక వర్గంనుంచి కొన్నాళ్ల కిందటే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన తాటికొండ రాజయ్యకు అదృష్టం తట్టి ఏకంగా డిప్యూటీ సీఎం పదవి వరించింది. దీంతో కులాల సమీకరణాల్లో కొప్పుల చిత్తయిపోయారని ఆయన అనుయాయులు అప్పట్లో కుమిలిపోయారు. ఆయన కూడా సీఎం కేసీఆర్ ను కలిసి అసంతృప్తి వ్యక్తం చేశారు..
స్పీకర్ పదవి వద్దన్నకొప్పుల
డిప్యూటీ సీఎం పదవి రాజయ్య కు పోవడంతో అప్పట్లో సీఎం కేసీఆర్ కొప్పుల ఈశ్వర్ కు స్పీకర్ పదవి ఆఫర్ ఇచ్చారు.కానీ తనకు మంత్రి పదవే కావాలనే కొప్పుల భీష్మించుకోవడంతో స్పీకర్ చైర్ కాస్తా మధుసూదనాచారికి లభించింది. మలివిడతలో మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఆయన స్పీకర్ పదవిని వద్దనుకున్నారు. కానీ ఇప్పడు మంత్రిపదవి, స్పీకర్ పదవి రెండు దక్కకుండా పోయి కొప్పల, ఆయన అనుచరులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాలలకు అన్యాయం జరుగుతోందంటూ ధ్వజమెత్తున్నారు. రెండు సార్లు గెలిచిన కేటీఆర్ కు పదవి ఇవ్వగా లేంది .. 5 సార్లు ఎమ్మెల్యే టీఆర్ఎస్ పునాదుల్లోంచి ఉన్న కొప్పులకు మంత్రి పదవి లభించకపోవడం అన్యాయం అని తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు కొప్పలు అనుచరులు..
సమీకరణాలే కొంప ముంచాయి..
కాగా జిల్లాకు గరిష్టంగా ఒకటి , రెండు మంత్రిపదవులు లభిస్తున్నాయి. ఈ సమీకరణాల నేపథ్యంలో ఇప్పటికే కరీంనగర్ నుంచి ఈటెల, కేటీఆర్ లో మంత్రివర్గంలో కొలువుదీరి ఉన్నారు. ఇప్పడు ఏకంగా మూడో మంత్రిని కరీంనగర్ జిల్లానుంచి ఎంపిక చేస్తే తప్పుడు సంకేతాలు వెలువడుతాయనే ఉద్దేశంతోనే కేసీఆర్ కొప్పులకు మంత్రి పదవి కట్టబెట్టలేదని సమాచారం. ఆయనను బుజ్జగించి చీఫ్ విప్ పదవికి ఎంపిక చేశారు. గుడ్డిలో మెల్లలా కొప్పుల అయిష్టంగానే చీఫ్ విప్ పదవిని చేపట్టబోతున్నారు..
మొత్తానికి కులాల కుంపటి కొప్పుల పదవికు ఎసరుపెట్టింది. డిప్యూటీ సీఎం స్థాయికి వెళ్లాల్సిన స్థితి నుంచి చీఫ్ విప్ స్థాయికి పడిపోయేలా చేసింది. కనీసం స్పీకర్ పదవి తీసుకున్న పోయేది అని ఇప్పుడు బాధ పడ్డా లాభం లేదు మరి.. ఇప్పడు కొప్పుల ను చూసి అందరూ అయ్యో పాపం అంటున్నారు..