
అహ్మదాబాద్, ప్రతినిధి : తన చెల్లెల్ని కుక్కనుంచి అద్భుతంగా రక్షించాడో అన్న.. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో ఈ ఘటన జరిగింది. నగరంలోని మకార్బా ప్రాంతంలో కాంచీ అనే పదిహేను నెలల అమ్మాయి అపార్ట్మెంట్ ఆవరణలోని పచ్చికలో ఆడుకుంటుండగా అక్కడే ఉన్న ఒకరి పెంపుడు కుక్క హఠాత్తుగా ఆమెపై దాడి చేసింది. కాంచీ అన్న పదేళ్ళ కాషిష్ వెంటనే తన చెల్లెలిని రక్షించడానికి ప్రయత్నించాడు. అయినా జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన కుక్క వదలకుండా ఆ చిన్నారిని కొంతదూరం లాక్కుని వెళ్ళింది.
అయితే కాషిష్ భయపడకుండా దానివెంటే పరుగెత్తి ఎలాగైతేనేం.. అతి కష్టం మీద ఆ చిన్నారిని కాపాడగలిగాడు. అక్కడే ఉన్న వారంతా కాస్సేపు దిగ్భ్రాంతితో ఇదంతా చూస్తూ ఉండిపోయారు. కుక్క దాడిలో కాంచీ దుస్తులు చిరిగిపోయాయి. ఆ చిన్నారి గాయపడనప్పటికీ తీవ్రంగా భయపడిపోయింది. చివరకు పక్క అపార్ట్మెంట్నుంచి కొందరు యువకులు వచ్చి కాషిష్కి సాయపడ్డారు. కాంచీని ఆసుపత్రికి తీసుకువెళ్ళి యాంటీ రేబిస్ ఇంజెక్షన్ ఇప్పించారు. కాషిష్ సాహసాన్ని అభినందించని వాళ్ళు లేరు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీ కెక్కింది.