కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశకు పర్యావరణ, అటవీ అనుమతులు

కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశకు పర్యావరణ, అటవీ అనుమతులు
ప్రాజెక్ట్ అనుమతులపై గ‌ట్టిగా పోరాడిన టి.ఎస్. సర్కారు.
అట‌వీ భూమి, వన్య ప్రాణుల సంర‌క్ష‌ణ వేర్వేరు అంశాలన్న ప్రభుత్వం.
ఎన్జీటీ కేసును అట‌వీ భూమి సేక‌ర‌ణతో ముడి పెట్ట‌వద్ద‌న్నవాదనతో ఏకీభవించిన కేంద్రం.
అటవీ భూముల బదలాయింపునకు అనుమతి

ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశకు పర్యావరణ, అటవీ అనుమతులు లభించాయి. ప్రాజెక్టుకు అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి బుధవారం నాడు అధికారిక సమాచారం వచ్చింది. 3,168 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం బదలాయించేందుకు కేంద్ర అటవీశాఖ అనుమతించడం కీలక పరిణామం. అటవీ డివిజన్ల పరిధిలోని అటవీ భూముల బదలాయింపునకు అనుమతి లభించింది. దీంతో జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, మెదక్‌, నిజామాబాద్‌, బాన్సువాడ, నిర్మల్‌ లోని అటవీ భూముల బదలాయింపునకు మార్గం సుగమమైంది.గత మార్చి 28 న కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కు సంబంధించి కీల‌క‌మైన దాదాపు 3 వేల 168 హెక్టార్ల అట‌వీ భూసేక‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తొలి అడుగు వేసింది. ప్ర‌తినెల దేశంలోని అట‌వీ భూముల‌కు సంబంధించి ప‌లు ప్రాజెక్ట్ లు, ప‌రిశ్ర‌మ‌ల అనుమ‌తుల‌పై ఫారెస్ట్ అడ్వైజ‌రీ క‌మిటీ స‌మావేశం నిర్వ‌హిస్తుంది. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ కు సంబంధించి తొలి స‌మావేశం జూన్ 16 న జ‌రిగింది.

అయితే ఈ స‌మావేశంలో ఎఫ్ఏసి.. భూమికి బ‌దులు భూమి ఇచ్చే విష‌యంలో కొంత అసంతృప్తి వ్య‌క్తం చేసింది. దీంతో జులై 20 న జ‌రిగిన రెండో సమావేశంలో ఈ చిక్కుముడికి తోడుగా, వ‌న్య ప్రాణుల ర‌క్ష‌ణ అంశం కూడా ఎఫ్ఏసీ లో తెర‌పైకి వ‌చ్చింది. ఇదే సంద‌ర్భంలో ప్రాజెక్ట్ ను ఎలాగైనా ఆపాల‌న్న ఉద్దేశంతో జాతీయ హరిత ట్రిబ్యూనల్ లో కొందరు వ్యక్తులు కేసు వేశారు. ఆగస్టు 15న‌ జ‌రిగిన ఎఫ్.ఏ.సీ స‌మావేశంలో ప్రాజెక్ట్ అనుమతులపై ప్రభుత్వం గ‌ట్టిగా పోరాడింది. అట‌వీ భూమి, వన్య ప్రాణుల సంర‌క్ష‌ణ అంశాలను ప్ర‌త్యేకంగా చూడాల‌న్న అంశంతో పాటూ, ఎన్జీటీ కేసు ను అట‌వీ భూ సేకరణతో ముడి పెట్ట‌వద్ద‌న్న విష‌యాన్ని ఎఫ్ఏసీ లో వివ‌రించింది. దీనికి తోడు అటవీ భూమికి బ‌దులు రాష్ట్ర  ప్ర‌భుత్వం మ‌రోచోట ఇస్తున్న భూమి విష‌యాన్ని ఇరిగేషన్ అధికారులు క‌మిటీకి వివరించారు.

దీంతో అన్ని అంశాల‌తో సంతృప్తి చెందిన ఎఫ్ఏసీ.. సెప్టెంబ‌ర్ 21 న జ‌రిగిన స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 3వేల168 హెక్టార్ల అట‌వీ భూసేక‌ర‌ణ సన్నాహాల‌కు సిద్ధంగా ఉన్న‌ట్లు మినిట్స్ ను రూపొందించింది. ఎఫ్ఏసి మినిట్స్ ఆధారంగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కాళేశ్వరం మొదటి దశకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపింది.కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ లో 3 వేల 168 హెక్టార్ల అట‌వీ భూమి ప్రాజెక్ట్ ప‌నులు, కాలువల నిర్మాణానికి, దాదాపు 28 వేల హెక్టార్ల సాగుభూమి ముంపునకు గురవుతుంది. కాగా, 3వేల 168 హెక్టార్ల‌లో 900 హెక్టార్ల‌లో కాల్వల ప‌నులు జ‌రగాల్సి ఉంటుంది. మ‌రో 22 వంద‌ల హెక్టార్ల‌లో ప్ర‌ధాన‌మైన ప్రాజెక్ట్ ప‌నులు నడుస్తాయి. అయితే ఎఫ్ఏసీ అనుమ‌తులు వ‌చ్చిన
నేప‌థ్యంలో 9 వంద‌ల హెక్టార్ల‌లో కాలువ‌ల ప‌నులు ప్రారంభించ‌వ‌చ్చు. 22 వంద‌ల హెక్టార్ల‌లో మాత్రం ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు పొందిన త‌ర్వాతే ప‌నులు ప్రారంభించాల్సి ఉంటుంది. కాలువ‌ల నిర్మాణంలో 9 వంద‌ల హెక్టార్లలో మేడిగ‌డ్డ దగ్గరకాలువ‌ల నిర్మాణం అత్యంత కీల‌క‌మైంది. ఈ ఏరియాలో దాదాపు 350 హెక్టార్లలో ప‌నులు చాలా ముఖ్యమైంది. మేడిగడ్డ వ‌ద్ద గోదావ‌రి నీటిని క‌న్నెప‌ల్లికి ఎత్తి పోస్తారు. అక్క‌డి నుంచి అన్నారం బ్యారేజ్, సుందిళ్ల బ్యారేజ్, బండ‌ప‌ల్లి బ్యారేజ్ కు నీటిని తరలిస్తారు.28 వేల హెక్టార్ల‌ సాగు భూముల‌ సేక‌ర‌ణలో ఇప్ప‌టికే 14 వేల హెక్టార్లు పూర్తైంది. అయితే 3 వేల 168 హెక్టార్ల అట‌వీ భూమికి బ‌దులు రాష్ట్ర ప్ర‌భుత్వం 3 వేల 400 హెక్టార్ల భూమిని జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి, రాజ‌న్న సిరిసిల్ల‌, న‌ల్లగొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి, కరీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి జిల్లాల్లో ఇవ్వ‌నుంది.

దీనికి సంబంధించిన ప‌నులు సైతం వేగ‌వంతంగా కొన‌సాగుతున్నాయి.ప్ర‌స్తుతం అట‌వీ భూమి బదాలయింపునకు మొదటి దశ అనుమ‌తులు వచ్చిన నేప‌థ్యంలో ప్ర‌స్తుతం అట‌వీ భూమికి బ‌దులు ఇస్తున్న భూమికి సంబంధించిన పూర్తిస్థాయి రికార్డుల ప‌రిశీల‌న‌, అప్ప‌గింతను పూర్తి చేయాలి. అట‌వీ భూమికి బ‌దులు ఇవ్వ‌నున్న భూమి సంర‌క్ష‌ణతో పాటు.. అట‌వీ భూమికి బ‌దులు దాదాపు 574 కోట్లు డిపాజిట్ చేయాలి. 2018 డిసెంబర్ కల్లా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేయాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కృత నిశ్చయంతో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత నుంచి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల వరకు ఎత్తిపోతల ద్వారా హైదరాబాద్ వరకూ నీరు మళ్లిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర పరిస్థితులు, అన్నదాతల ప్రయోజనాలకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *