
కాళేశ్వరంపై కేంద్రం సంతృప్తి.
అనుకున్న విధంగానే వేగంగా పనులు.
నిర్ణీతకాల పరిమితిలో కాళేశ్వరం పూర్తి.
అన్ని రాష్ట్రాల్లో తాగు, సాగునీటి పథకాలకు ప్రాధాన్యం.
అడవులకు ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ.
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల తీరు పట్ల కేంద్ర ప్రభుత్వం సంతృప్తిని వ్యక్తం చేసింది.
కాళేశ్వరం ప్రాజేక్ట్ దేశ ప్రగతికి తోడ్పడుతుందని కేంద్ర పర్యావరణ కార్యదర్శి సీకే మిశ్రా అన్నారు.ఈ ప్రాజెక్టు పనుల తీరు స్వయంగా తెలుసుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం నుంచి కాళేశ్వరం కు ఇంకా ఏ విధమైన సహకారం, ప్రోత్సహం అవసరమో అధ్యయనం చేయడానికి తాను పర్యటించినట్టు మిశ్రా మీడియాకు తెలిపారు. ఆయన బుధవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టు కు చెందిన అన్నారం బ్యారేజీ, ప్యాకేజి 11 టన్నెల్, రంగనాయకిసాగర్ రిజర్వాయర్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈప్రాజేక్ట్ సాగు,త్రాగు నీరుకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.పచ్చదనం ,భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. ప్రశాంత పూరిత వాతవరణంలో ప్రాజేక్ట్ పనులు వేగంగా జరుగుతున్నట్టు మిశ్రా తెలిపారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా లో అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమాలను పరిశీలించారు. కోమటిబండ సమీపంలో ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ చాలా బాగుందని ప్రశంసించారు. అటవీశాఖ చేస్తున్న బ్లాక్ ప్లాంటేషన్ వల్ల అటవీ విస్తీర్ణం పెరుగుతుందన్నారు. హరితహారం దేశానికే ఆదర్శం అని మిశ్రా వెల్లడించారు. చిన్న కోడూరు మండలం చందళాపూర్ దగ్గర కాళేశ్వరం ప్యాకేజి 11 టన్నెల్, పంప్ హవుజ్, సర్జ్ పూల్ పనులతో పాటు రంగనాయకసాగర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి సి.కె.మిశ్రా సంతృప్తి ని వ్యక్తం చేశారు.
ఇలాంటి భారీ ప్రాజెక్టులను చేపట్టినపుడు పర్యావరణానికి నష్టం జరగకుండా చూడడం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని మిశ్రా చెప్పారు. తెలంగాణ ప్రజల తాగు, సాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆయన అన్నారు.పనులు వేగంగా జరుగుతున్నందుకు తనకు సంతోషంగా ఉందని కేంద్ర కార్యదర్శి చెప్పారు. అడవుల పెంపకం పట్ల, అటవీ పరిరక్షణ పట్ల టి.ఎస్.ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. త్వరితగతిన నిర్ణీత వ్యవధి లో ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో వాడుతున్న టెక్నాలజీ పర్యావరణంపై ప్రభావం పడకుండా చూడవలసీ ఉందని మిశ్రా అభిప్రాయపడ్డారు.అన్ని రాష్ట్రాలలోనూ తాగు,సాగు నీటి పథకాలు తెలంగాణ లాగా పెద్ద ఎత్తున చేపట్టాలని అభిప్రాయ పడ్డారు.కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ కార్యదర్శి మిశ్రా వెంట ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జోషి, కాళేశ్వరం సి.ఈ.హరి రామ్ ఉన్నారు.