కాళేశ్వరం ప్రాజెక్టుకు వెల్లువై పారుతున్నఅనుమతులు

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల వెల్లువ.

అడ్డంకులు దాటుతున్న సాగునీటి కల్పతరువు.

తుది అటవీ అనుమతిని మంజూరు చేసిన  కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ.

అద్భుత ఫలితాన్నిచ్చిన రీ డిజైను.

పల్లేర్లు మొలిచిన నేలలో పండనున్న బంగారం.

తెలంగాణ ఇరిగేషన్ కు  కాళేశ్వరం కేంద్రబిందువు.

కెసిఆర్ రీ డిజైను వెనుక త్రిముఖ వ్యూహం’.

__________________________________________________

ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి,నిరంతర  పర్యవేక్షణ  కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అవరోధాలన్నీ తొలగిపోతున్నాయి.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మరో మైలురాయిని దాటింది. కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ నుంచి శుక్రవారం నాడు అంతిమ క్లియరెన్సు లభించింది.సి. ఏం. కెసిఆర్ ఆదేశాలతో మంత్రి హరీష్ రావు  కేంద్రం నుంచి ఈ భారీ , ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రావలసిన అనుమతుల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కోర్టు కేసులతో  అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు, శక్తులకు ఇది చెంపపెట్టు అని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ఒక ప్రకటనలో అన్నారు. మిగతా డైరెక్టరేట్ల నుంచి ఇంకా మిగిలిపోయిన అనుమతులను కూడా  త్వరితగతిన సాధించాలని ఆయన ఇరిగేషన్ ఉన్నతాధికారులను కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నుంచి వరుసగా వివిధ అనుమతులు వస్తున్నాయి. గత 15 రోజుల వ్యవధిలోనే ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్సు, అంతర్రాష్ట్ర అనుమతి, కేంద్ర భూగర్భ జల శాఖ, కన్స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీ  అనుమతులు వచ్చాయి.ప్రాజెక్టు పరిధిలో పర్యావరణ ప్రభావిత మదింపు అంచనాకు సంబంధించి టర్మ్ ఆఫ్ రిఫరెన్సు రావడంతో తెలంగాణ  15 జిల్లాల్లో, మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో  ప్రజాభిప్రాయ సేకరణ  కూడా పూర్తయ్యింది. అటవీ భూములకు సంబందించి కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ నుంచి మొదటి దశ అనుమతులు గతంలోనే వచ్చాయి.ఇరిగేషన్ మంత్రి మంగళ, బుధవారాల్లో దిల్లీలో కేంద్రమంత్రులతో, జల వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి అధికార యంత్రాంగంతో రెండు రోజుల పాటు జరిపిన మంత్రాంగం సత్ఫలితాలనిస్తోంది.

కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ 24.10.2017 న జారీ చేసిన మొదటి దశ అనుమతిలో 3221.2974 హెక్టార్ల ( 8182 ఎకరాలు ) అటవీ భూమిని కాలువలు , టన్నెల్లు , పంప్ హౌజ్ లు , సర్జ్ ఫూల్స్, జలాశయాలు,డెలివరీ సిస్టెర్న్ తదితర నిర్మాణాలకు  వినియోగించుకోవడానికి అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ అటవీ భూమి ప్రాజెక్టు పరిధిలోని 8 జిల్లాల్లోని మహాదేవపూర్, కరీంనగర్-సిరిసిల్లా,సిద్దిపేట్,యాదాద్రి,మెదక్,నిజామాబాద్-బాన్స్ వాడ  అటవీ డివిజన్లలో విస్తరించి ఉన్నాయి.

స్టేజ్ 1 క్లియరెన్సు ఇస్తూ అటవీ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నియమ, నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా అమలు  చేసింది. ప్రత్యామ్నాయ అటవీ సంపదను పెంచడానికి అయ్యే ఖర్చు 723 కోట్ల రూపాయలను అటవీ శాఖకు జమ చేసింది.ప్రభుత్వం ఈ మేరకు   సమగ్ర నివేదిక ను కేంద్ర అటవీశాఖకు సమర్పించింది.కేంద్ర అటవీ శాఖ ఈ నివేదికను పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత తుది అటవీ అనుమతులను మంజూరు చేస్తూ  ప్రభుత్వ  స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి లేఖ రాసింది. దీంతో ఎనిమిది జిల్లాల్లో 8 వేల 182 ఎకరాల అటవీభూమిని ప్రాజెక్టు పనుల కోసం వినియోగించుకోవడానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఇంత పెద్ద విస్తీర్ణంలో అటవీ భూములను బదలాయించడం సరికొత్త రికార్డు.

ఇతర ప్రాజెక్టులకు జీవం పోయడంతోపాటు, పునర్జీవం కల్పించే కొత్త చరిత్ర ను  కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లిఖించబోతున్నది. ఉత్తర తెలంగాణకు వర ప్రదాయినిగా ఉన్న గోదావరిని దక్షిణ తెలంగాణకు మళ్లించి, పల్లేర్లు మొలిచిన నేలలో కాళేశ్వరం ప్రాజెక్టు బంగారం పండించనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్  త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. లోయర్ మానేరు డ్యాంకు జీవం పోసి, ఎస్సారెస్పీకి పునర్జీవం కల్పించడంతో పాటు దక్షిణ తెలంగాణకు నీళ్లు పారించనున్నారు. కాళేశ్వరం రాష్ట్ర సాగునీటి రంగంలో పెను మార్పులకు కేంద్ర బిందువు. దీని ద్వారా గోదావరి జలాలను అత్యధికంగా వినియోగించుకోవడమనేది ప్రధాన లక్ష్యంగా పైకి కనిపిస్తున్నప్పటికీ రీడిజైనింగ్ లోనే త్రిముఖ వ్యూహం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మూలాధారమైన భారీ బరాజ్ నిర్మానం కోసం  మేడిగడ్డ  ను ఎంపిక చేయడమే గొప్ప మలుపు. గోదావరిలో ఇక్కడ నీటి లభ్యత పుష్కలంగా ఉన్నదని అనేక సాంకేతిక అధ్యయనాలు తేల్చిచెప్పాయి. అందుకే మేడిగడ్డ కేంద్రంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది.. తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా రుజువు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం  మెరుపువేగంతో ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నది.

కాళేశ్వరం  వల్ల 18. 25  లక్షల కొత్త ఆయకట్టు, మరో 18.82 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు స్థిరీకరణ  జరగనున్నది. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసి అన్నారం, సుందిల్ల బరాజ్‌ల ద్వారా ఎల్లంపల్లికి తరలిస్తారు. అటు నుంచి మిడ్‌మానేరు, ఆ పై పలు రిజర్వాయర్ల ద్వారా కీలకమైన మల్లన్నసాగర్, కొండపోచమ్మ, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్లలోకి తరలించి సాగునీరు అందిస్తారు. ఈ క్రమంలోనే 142 టీఎంసీలకుపైగా గోదావరిజలాలను నిల్వ చేయనున్నా రు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏటా రెండు పంటలు పండించేలా చూడటమే దీని ఉద్దేశం.ఇది మొదటి వ్యూహం.

మేడిగడ్డ నుంచి తరలించిన నీటిని ఎలాగూ మిడ్‌మానేరు ద్వారా తీసుకెళ్తారు. ఇక్కడి నుంచి లోయర్ మానేరుడ్యాంకు నీటిని తరలించనున్నారు. దీంతో ప్రధాన గోదావరిలో తగ్గుతున్న నీటి లభ్యతతో ఆందోళనకరంగా ఉన్న శ్రీరాంసాగర్, లోయర్‌మానేరుకు కాళేశ్వరం ప్రాజెక్టు జీవం పోసినట్టవుతుంది. అలాగే ఎస్సారెస్పీపైనా భారం గణనీయంగా తగ్గుతుంది. ఎస్సారెస్పీ ద్వారా ఎల్‌ఎండీ వరకు ఉన్న ఆయకట్టుకు నీరందించి, మిడ్‌మానేరు-ఎల్‌ఎండీ గోదావరి జలాల తరలింపు ద్వారా ఎల్‌ఎండీ దిగువన ఉండే ఎనిమిదిన్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. దీంతో చివరి ఆయకట్టుకూ పుష్కలంగా సాగునీరు అందనున్నది.ఇది రెండవ వ్యూహం.

ఎస్సారెస్పీ డిజైన్ సమయంలో నీటి లభ్యత 196 టీఎంసీలుగా అంచనా వేశారు. మానేరు ద్వారా ఎల్‌ఎండీకి మరో 12 టీఎంసీలు వస్తుందని భావించి 208 టీఎంసీల లభ్యతను లెక్కగట్టారు. ఎగువన మహారాష్ట్ర గోదావరి నీటిని పలు ప్రాజెక్టులు నిర్మించుకోవడంతో  నీటి లభ్యత 54 టీఎంసీలకు పడిపోయింది. ఐదారేండ్లుగా లభ్యత మరింతగా తగ్గింది. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు జలాలను తరలించే క్రమంలో వరదకాల్వ ద్వారా జలాల్ని ఎస్సారెస్పీలోకి రివర్స్ పంపింగ్ చేసేందుకే పునర్జీవ పథకాన్ని సి.ఎం.కెసిఆర్ ప్రారంభించారు.ఇది మూడో వ్యూహం.

2018 జూన్‌నాటికి కాళేశ్వరం నీళ్లు మధ్యమానేరు ప్రాజెక్టుకు పంపించేందుకు అనుసంధానం కానుంది.శ్రీరాంసాగర్ ప్రాజెక్టును కాశేశ్వరంతో అనుసంధానం చేయడానికి ఇటీవలే రూ.వేయి కోట్లు మంజూరు చేశారు. ఈ పనులు పూర్తయితే ఎస్సారెస్పీ కింద ఉన్న 16 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించడానికి వీలు కలుగనున్నది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును దాదాపు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు.  13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చనుంది. గోదావరి నది నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు మళ్లించడం ఈ పథకం ఉద్దేశం. 3 బ్యారెజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్ట్లు.నీటీ నిల్వసామర్ద్యం- 142 టిఎమ్సిలు..ప్రధాన కాలువల డిస్టిబ్యూషన్ పొడవు-1531కి.మీ.సొరంగాల పొడవు-203కి.మీ.మొత్తం పంపులు-82 నిర్మాణంలో ఉన్నాయి.

గతంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన నిల్వ సామర్థ్యం కేవలం 16.43 టీఎంసీలే! కానీ.. సీఎం కేసీఆర్ దీన్ని రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా ముందుకు తెచ్చారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం ఎకాఎకిన 142 టీఎంసీలకు పెరిగింది.  వరుసగా రెండు మూడేండ్లు వర్షాలు లేకున్నా.. తెలంగాణ రైతాంగానికి సాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 18,25,000 ఎకరాల ఆయకట్టును సాధించడమే కాకుండా మరో 18.80  లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి 37 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు ప్రాజెక్టు దోహదం చేస్తుంది.కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాలోనూ రెండుపంటలు పండించుకునే అవకాశం కలుగుతుంది . మెదక్, నిజామాబాద్, నిర్మల్ లాంటి జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

కాళేశ్వరం ప్రత్యేకతలు ;

ఇప్పటి వరకూ దేశంలో అతిపెద్ద సర్జపూల్ ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ ప్రాజెక్టులో ఉంది. దీని డయా 36 మీటర్లు! కానీ కాళేశ్వరం 10 వ ప్యాకేజీ లో భాగంగా  తిప్పాపూర్‌లో నిర్మిస్తున్న సర్జ్‌పూల్ డయా ఏకంగా 56 మీటర్లు .మామూలుగా నాన్ ఓవర్‌ఫ్లో డ్యామ్‌లో రోజుకు 200 నుంచి 300 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరుగుతాయి. కానీ.. అత్యంత అధునాతన యంత్రం టెలిబెల్ట్-టీబీఎస్ 130 ద్వారా గంటకే 120 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తవుతున్నాయి. ఈ విధంగా నిర్దిష్ట వ్యవధిలో ప్రాజెక్టు పరిపూర్తికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి జలాలను   2018  వానాకాలం కల్లా ఎత్తిపోయాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం నీటిపారుదలశాఖతోపాటు కాంట్రాక్టు ఏజెన్సీలను సైతం పరుగులు పెట్టిస్తున్నది. ప్రాజెక్టులోని పదో ప్యాకేజీలో చేపట్టిన.. దేశంలోనే అతి పెద్ద సర్జ్‌పూల్ పనులు పూర్తీ కావస్తున్నాయి. ప్రపంచంలోనే పెద్ద సొరంగ మార్గం ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్ వరకు 81 కిలోమీటర్ల పొడవున  నిర్మిస్తున్నారు.పకడ్బందీ ప్రణాళిక, కార్యాచరణతో ప్రాజెక్టు నిర్దిష్ట సమయంలో ఫలితాలనందించేలా కొనసాగుతున్నది.

ప్రాజెక్టుకు అవసరమయ్యే మొత్తం భూమి విస్తీర్ణం 74,315-28 ఎకరాలు.ఇప్పటిదాకా సేకరించిన భూమి 34410- 08 ఎకరాలు.సేకరించవలసిన భూమి 43,565.39 ఎకరాలు.ప్రాజెక్టులోఅత్యంత ముఖ్యమైన లింకు 1, 2 పనులను  త్వరితగతిన పూర్తి  చేయడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆర్ధిక వనరులను సమకూర్చింది. లింక్ 1 పనులకు ఆంధ్రా బ్యాంక్ కన్సార్టియం ద్వారా రూ. 7,400 కోట్ల నిధులని సమకూర్చింది.  పంజాబ్ నేషనల్ బ్యాంక్కన్సార్టియం ద్వారా రూ.  11,400 కోట్లనిధులను సమకూర్చేందుకు ఒప్పందంపై సంతకాలు జరిగినాయి. ఈ రెండు కన్సార్టీయమ్ల ద్వారా ప్రాజెక్టు పనులకు నిధులు సమకూరుతున్నాయి. మిగతా ప్యాకేజీ పనుల కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులు సమకూరుస్తున్నది.కాళేశ్వరం  ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చే  నీటిని అత్యంత వినియోగ సామర్థ్యంతో వాడుకోవడానికి గాను మహారాష్ట్ర,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలుఅవుతున్న piped irrigation విధానాన్ని రాష్ట్రంలో అమలు చెయ్యడానికి ప్రయోగాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 21 కింద ఆయకట్టును ప్రభుత్వం ఎంపిక చేసింది.ఒక టి ఎం సి నీటితో 15 నుంచి 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించవచ్చునని ఇతర రాష్ట్రాల అనుభవాలు చెపుతున్నాయి.

Post source : kaleshwaram project

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *