
టైం బాడ్.. పొన్నాల లక్ష్మయ్య చేజేతులా పదవి పోగొట్టుకున్నాడు. తెలంగాణ ఏర్పడ్డకా తొలి పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన పొన్నాల అది మూన్నాల్ల ముచ్చటగా మిగిలిపోవడంతో బయట కనిపించడం లేదు. అసలు దీని వెనుక ఏం జరిగిందో తెలుసుకునే లోపే అధిష్టానం టీపీసీసీ పీఠంపై ఉత్తమ్, భట్టిలను కూర్చొబెట్టడంతో ప్రక్షాళనలో పొన్నాల ఇష్యూ కనుమరైపోయింది.
ఆది నుంచి టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం పొన్నాల విఫలమయ్యాడు. పార్టీ ఫిరాయింపులను ఆపలేకపోయాడు. ఎన్నికల ముందు తెలంగాణలో నంబర్ 1 గా ఉన్న పార్టీ ని ఎన్నికల తర్వాత కుదేలయ్యేలా చేశాడనే ప్రధాన అభియోగం పొన్నాలకు పదవిని దూరం చేసింది. స్వయంగా వరంగల్ నేతలను కూడా పార్టీలో కొనసాగించకుండా టీఆర్ఎస్ బాట పట్టించారని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. పీసీసీ అధ్యక్షుడిగా కాకుండా.. కేవలం సొంత ప్రయోజనాలే ప్రాతిపదికగా పొన్నాల వ్యవహించారని అధిష్టానం భావించింది. దీంతో పీసీసీ పీఠంను మరొకరికి అప్పగించింది.
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ పొన్నాల ఎవరినీ సంప్రదించకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఏకపక్షంగా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడం .. సొంత పార్టీ నేతలు విమర్శించడం పొన్నాల పదవికే ఎసరు తెచ్చింది. ఈ పరిణామాలు ఇప్పుడు కాంగ్రెస్ ను కుదిపేస్తున్నాయి.