
వచ్చేనెల 1వ తేది నుంచి 8 వ తేది వరకు బంగ్లాదేశ్ రాజధాని ధాకా లో జరగనున్న 63 వ కామన్ వెల్త్ పార్లమెంటరీ సదస్సు 2017 సన్నాహక సమావేశం మంగళవారం నాడు పార్లమెంట్ లో జరిగింది. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదన చారి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభ సెక్రటరీ నర్సింహా చారి లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదన చారి పలు సూచనలు, అభిప్రాయాలను తెలియజేశారు. ధాకా లో జరగనున్న ఈ సమావేశంలో దాదాపు 54 దేశాలకు చెందిన సుమారు 5 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 63 వ కామన్ వెల్త్ పార్లమెంటరీ సదస్సు 2017 సన్నాహక సమావేశంలో ప్రధాన చర్చాంశనీయాల్లో ప్రజాస్వామ్య పార్లమెంటరీ పద్దతుల బలోపేతానికి, ప్రపంచ దేశాలు అనుసరించాల్సిన విధానాల చర్చలో భాతర దేశం తరుపున లేవనెత్త వలసిన ముఖ్య అంశాలపై చర్చ జరిగింది.
సమావేశం అనంతరం తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదన చారి మీడియా తో మాట్లాడుతూ.. 63 వ కామన్ వెల్త్ పార్లమెంటరీ సదస్సు 2017 సన్నాహక సమావేశంలో పాల్గొనడం అరుదైన గౌరవమని ఆయన తెలిపారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలపై ప్రస్పుటంగా, సుదీర్ఘంగా కామన్ వెల్త్ పార్లమెంట్ సదస్సులో చర్చలు జరిగే అవకాశం ఉందని స్పీకర్ తెలిపారు. నవంబర్ ఒకటి నుంచి 8 వ తేది వరకు జరిగే సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున విలువైన సూచనలు, తీసుకోవాల్సిన చర్యలపై ఒక స్పష్టమైన ప్రణాళికతో ధాకా వెళ్తామని తెలంగాణ శాసన సభ స్పీకర్ మధుసూదన చారి తెలిపారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ మీడియా తో మాట్లాడుతూ… 63 వ కామన్ వెల్త్ పార్లమెంటరీ సదస్సు 2017 సన్నాహక సమావేశంలో ఫలవంతమైన చర్చలు జరిగాయని తెలిపారు. 63 వ కామన్ వెల్త్ పార్లమెంటరీ సదస్సు చట్లసభల గౌరవాన్ని మరింత పెంచడంతో పాటూ, ప్రజాస్వామ్య వ్యవస్థను, దేశ ప్రగతిలో చట్ట సభల ముఖ్యపాత్రను ప్రజలకు తెలిపేలా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ వివరించారు.