
లక్నో, ప్రతినిధి : కరీంనగర్ ఆడబిడ్డ ఉత్తరప్రదేశ్ కాంట్రాక్టర్ల దుమ్ము దులిపింది. కలెక్టర్ గా పనిచేస్తున్న ఆమెను చూసి అవినీతి ఉద్యోగులు, కాంట్రాక్టర్లు బెంబేలెత్తి పోతున్నారు. యూపీలోని బులంద్ షహర్ జిల్లా కలెక్టర్ చంద్రకళ ది కరీంనగర్ జిల్లానే.. రామగుండం ఎరువుల కర్మాగారా విశ్రాంత ఉద్యోగి భూక్య కిషన్ కుమార్తె అయిన 35 ఏళ్ళ ఈ తెలంగాణ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లా కలెక్టర్.. మధుర నుంచి బులంద్ షహర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన ఈమె..అక్కడ ప్రజా పనుల్లో జరుగుతున్న అవినీతిమీద మండిపడ్డారు. రహదారి పనుల్లో నాసిరకం ఇటుకలు, టైల్స్ వాడినట్టు గుర్తించిన చంద్రకళ అక్కడి అధికారులను, కాంట్రాక్టర్లను ఏకి పారేశారు. స్కూలు పిల్లల్లా వరుసగా నిలబెట్టి వాళ్ళమీద అందరిముందే చిందులేశారు.
‘కాంట్రాక్టర్లు నాసిరకంగా చేస్తే జైలుకు పంపిస్తానని..మీలో కాస్తైనా నైతికత ఉందా..?మీరు సిగ్గుతో తలదించుకోవాలి’ అంటూ నోరెత్తకుండా చేశారు. చంద్రకళ ధాటికి అధికారులు, కాంట్రాక్టర్లు పిల్లుల్లా అయిపోయి నోరెత్తితే ఒట్టు. మొత్తం 17 కాంట్రాక్టుల్ని ఈమె రద్దు చేశారు. ఈ లేడీ సింఘం వివరాల్లోకి వెళ్తే.. గిరిజన తెగకు చెందిన బుఖ్యా చంద్రకళ స్వస్థలం కరీంనగర్ జిల్లా రామగుండం. హైదరాబాద్ లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు.. 2008 లో సివిల్స్ లో 409వ ర్యాంకు సాధించారు.. చంద్రకళ భర్త శ్రీరాములు శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో డీఈఈగా పనిచేస్తున్నారని, వీరికి తొమ్మిదేళ్ళ కుమార్తె ఉందని తెలిసింది. బులంద్ షహర్ లో అవినీతి అధికారుల మీద అపర కాళికలా ధ్వజమెత్తిన చంద్రకళ తాలూకు వీడియోని ఆరు లక్షలమంది చూశారు. మూడువేల కామెంట్లు, ఇరవైఏడు వేలకు పైగా షేర్లు వచ్చి పడ్డాయి.