కాంగ్రెస్ హైకమాండ్ పై జైపాల్ అంత మాటన్నారా?

హైదరాబాద్, ప్రతినిధి : కాంగ్రెస్ అధిష్టానం తీరుపై కొందరు నేతలు కస్సుబస్సుమంటున్నారు. కాంగ్రెస్ హై కమాండ్ అధినాయకత్వమే మారాలని పేర్కొన్న చిదంబరం రూట్ ను ఆ నేతలు ఫాలో అవుతున్నారు. అధిష్టానంపై పల్లెత్తు మాట పడనీయని ఆ సీనియర్ నేత అధిష్టాన తీరుపై కస్సుబుస్సులాడుతున్నట్లు సమాచారం. సీనియర్ నేత ఎవరనేదిగా మీ అనుమానం. ఆయనే తెలంగాణ కాంగ్రెస్ లీడర్ జైపాల్ రెడ్డి. ప్రస్తుతం పార్టీలో ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆయన పలు అంశాలపై అధిష్టానం తీరును తప్పుబట్టినట్లు సమాచారం.

పార్టీ ఓటమికి జైపాల్ విశ్లేషణ..
తనకు సన్నిహితంగా ఉండే వాళ్ల దగ్గర కాంగ్రెస్‌ అధిష్టానం తీరుపై జైపాల్ రెడ్డి తన మనసులో మాటను వెళ్లగక్కారని సమాచారం. అధిష్టానంపై ఎప్పుడూ ఆచితూచి మాట్లాడే జైపాల్‌రెడ్డి ఏకంగా ఢిల్లీ చర్యలను తప్పుపడుతూ ఏకిపారేశారట. పార్టీ ఓటమికి గల కారణాలను తనదైన శైలిలో విశ్లేషించిన ఆయన అప్పుడు అధిష్టానం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారని సమాచారం.

ఎన్నికల్లో కాంగ్రెస్ తీరును తప్పుబట్టిన జైపాల్..?
తెలంగాణ ఇచ్చి రాష్ట్రపతి పాలనతో ఎన్నికలకు వెళ్లడమే పార్టీ పుట్టి ముంచిందన్న జైపాల్‌రెడ్డి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డిని చివరివరకు ముఖ్యమంత్రిగా కొనసాగించే విషయంలో ఢిల్లీ పెద్దలు దిద్దుకోలేని తప్పుచేశారని కామెంట్‌ చేశారట. అంతేకాదు తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్‌తో కలిసి ముందుకు వెళ్లాలని తాను అధిష్టానం వద్ద నెత్తినోరుకొట్టుకున్నా పార్టీ పెద్దలు మాత్రం లైట్‌ తీసుకున్నారని అందుకే ఇప్పుడా ఫలితాన్ని అనుభవించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి తోడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్లందరూ సీఎం అభ్యర్థులుగా మారారని జైపాల్‌రెడ్డి ఎద్దేవా చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఎమ్మెల్యే టికెట్ల వ్యవహారంలో అధిష్టానం వ్యవహరించిన తీరును జైపాల్‌ తీవ్రంగా తప్పుపట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్‌ అడిగితే ఏకంగా సీఎం నీవే అన్నట్లు హైకమాండ్‌ వ్యవహరించిందని ఢిల్లీ పెద్దల తీరును తప్పుపట్టారని సమాచారం.

మోడీ..కేసీఆర్ లపై విమర్శలు..
కాంగ్రెస్‌ హైకమాండ్‌ తీరును ఏకిపారేసిన జైపాల్‌రెడ్డి అంతటితో ఆగకుండా ప్రస్తుత ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌లను కూడా వదలలేదని సమాచారం. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఇప్పుడే విమర్శలు చేయడం సరికాదంటూనే ప్రభుత్వాల తీరును కడిగిపారేసినట్లు తెలుస్తోంది. మోడీ, కేసీఆర్‌ పాలన ఇలాగే కొనసాగితే బీజేపీ, టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని జైపాల్‌రెడ్డి కామెంట్‌ చేశారట. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ కులాల ప్రాతిపదికన భవనాల నిర్మాణాన్ని జైపాల్ తీవ్రంగా తప్పుపట్టారని తెలుస్తోంది. అటు ఆంధ్రాలో కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వెళ్లడంపైనా జైపాల్‌రెడ్డి స్పందించినట్లు సమాచారం. ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదనే ఆలోచనతోనే నేతలు సొంతదారులు వెతుక్కుంటున్నారని కామెంట్‌ చేశారని తెలుస్తోంది.

మొత్తానికి ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే జైపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసినట్లు వస్తున్న వార్తలు పార్టీలో ఎలాంటి దుమారాన్ని రేపుతుందో చూడాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.