
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆసరా ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిర్ణయించారు. సంస్థ కార్యకర్తలు, రాజకీయ కేడర్, సంపన్నులు, ఎన్నారైలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆ కుటుంబాల పిల్లల చదువు, వైద్యంతో పాటు అవసరమైతే అప్పులు తీర్చ బాధ్యత కూడా తీసుకోవాలని నిర్ణయించారు.
కవిత మానవతావాదాన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు. అయితే, కవిత ప్లాన్ లోచిన్న మార్పు చేస్తే, అసలు రైతు ఆత్మహత్యలే జరగకుండా చూసే ప్రయత్నం చేయవచ్చు. మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని చేసినా పోయిన మనిషి తిరిగిరాడు. రైతు చనిపోయిన తర్వాత అతడి అప్పులు తీర్చే కంటే, ముందే రైతులకు అండగా ఉండటం మంచిది.
రైతు ఆత్మహత్యలకు ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి అప్పుల భారం. రెండోది పంట నష్టం. పంట నష్టానికి పరిహారం ఇవ్వడం, పంటల బీమా సక్రమంగా ఇప్పించడం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఈ పనిని సక్రమంగా చేస్తే ఈ కారణంతో రైతు ఆత్మహత్యలు జరిగే అవకాశం లేదు. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి కూతురిగా కవిత ఒత్తిడి తేవాలి.
ఇక అప్పుల భారం విషయంలోనూ ద్విముఖ వ్యూహం అమలు చేయాలి. ముందు హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేయాలి. అప్పుల కోసం ఒత్తిడి ఎదుర్కొంటున్న రైతులు ఆ నెంబర్లకు ఫోన్ చేస్తారు. తమ పరిస్థితి వివరిస్తారు. అవి బ్యాంకు అప్పులైతే ప్రభుత్వం రంగంలోకి దిగాలి. ఆ రైతు రుణం రీషెడ్యూల్ చేయడమా, రుణమాఫీ వర్తింప చేయడమా, మరో విధంగా అయినా రైతుకు కొంత సమయం ఇచ్చేలా చూడాలి.
ఒకవేళ ప్రయివేటు అప్పు అయితే కవిత ప్లాన్ అమలు చేయాలి. రైతుకు కొంత గడువు ఇచ్చేలా అప్పు ఇచ్చిన వ్యక్తిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ రుణదాతకు నిజంగానే డబ్బులు అత్యవసరం అయితే, అప్పులు సంపన్న దాతలు లేదా ఎన్నారైలు ముందుకు రావాలి. ఆ అప్పు తీర్చి రైతు ఆత్మహత్యను నివారించాలి. ఎలాగూ చనిపోయిన రైతుల అప్పులు తీర్చడానికైనా సిద్ధమని కవిత ప్రకటించారు. దానికి బదులు, బతికుండగానే అవసరమైతే అప్పుల భారం లేకుండా చేసే కొండంత అండ, తగినంత భరోసా ఉందనే నమ్మకం కలిగితే ఏరైతూ ఆత్మహత్య చేసుకోడు.
ఈ పద్ధతిలో కవిత కార్యాచరణ రూపొందిస్తే రైతు లోకానికి ఎంతో మేలు కలుగుతుంది. ఎన్నో కుటుంబాల్లో విషాదం ముంచుకు రాకుండా కాపాడినట్టు అవుతుంది. రైతు ఆత్మహత్యలను నివారించిన మహానుభావురాలిగా కవిత పేరు చరిత్రలో నిలిచిపోతుంది.