
ఢిల్లీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. తమ ఎమ్మెల్యేకు 4 కోట్ల రూపాయలు ఇవ్వజూపారంటూ బీజేపీపై ఆప్ తీవ్ర ఆరోపణ చేసింది. ఇందుకు ఆధారంగా ఒక వీడియోను బయటపెట్టింది.
ఈ పరిణామం బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించడం దుస్సాహసం అవుతుంది. అలాగని మళ్లీ ఎన్నికలకు వెళ్తే ఫలితం ఎలా ఉంటుందో అనేది మరో అనుమానం. లోక్ సభ ఎన్నికల్లో మోడీ హవా పనిచేసింది. ఢిల్లీలోని మొత్తం 7 సీట్లనూ బీజేపీ గెలుచుకుంది.
కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అదే జోరు కొనసాగుతుందనే గ్యారంటీ ఉందా అనేది బీజేపీ సందేహం. ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనమైనా, అసెంబ్లీ స్థాయి ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తుందని అంతా భావిస్తున్నారు. ఆప్ సైతం పాత తప్పులను ఒప్పుకుంటూ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. గతంలో ప్రభుత్వం నడపకుండా రాజీనామా చేయడం తప్పయి పోయిందంటూ కేజ్రీవాల్ అంగీకరించారు. క్షమించమని ప్రజలను కోరారు.
ఈ పరిస్థితుల్లో ఆప్ కాస్త బలపడితే బీజేపీ విజయానికి ఆటంకం అవుతుందనేది కమలనాథుల భయం. ఇప్పుడు ప్రధాని మోడీ మదిలో ఏముందనేది అంతుపట్టడం లేదు. మధ్యే మార్గంగా రాష్ట్రపతి పాలన పొడిగిస్తారా లేక ఏ నిర్ణయం తీకుంటారనేది వేచి చూడాల్సిందే