కమలానికి దగ్గరవుతున్న గులాబీ?

హైదరాబాద్, ప్రతినిధి : నిన్న మొన్నటి వరకు కేంద్రంతో ఎడమెహం, పెడమెహంగా ఉన్న టిఆర్ఎస్, బీజేపీకి దగ్గరయ్యేందుకు  ప్రయత్నాలను మొదలు పెట్టింది.  ప్రధాని మోడీని ప్రసన్నం చేసుకుంటే చాలనే అభిప్రాయం గులాబి పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.  మిత్ర పక్షాలుగా కొనసాగుతున్న తెలుగుదేశం, బీజేపీ నేతల్లో ఈ వ్యవహారం చర్చనీయంశంగా మారింది.

మారిన గులాబీ బాస్ వైఖరి..
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సయోధ్య కుదరకపోతే  భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాలను గులాబి పార్టీ ముందుగానే ఊహించినట్లుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే అనుకున్నంత మేర అభివృద్ధి సాధించలేమనే అభిప్రాయంతో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా బిజెపికి ఎప్పుడూ దూరంగా ఉండేందుకు ప్రయత్నించిన గులాబి బాస్ తన వైఖరిని మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

పార్టీ వైఖరిలో కనిపిస్తున్న స్పష్టమైన మార్పు…
కేంద్ర ప్రభుత్వంతో తమకు ఎలాంటి విభేదాలు లేవని ప్రకటిస్తూ వస్తున్న టిఆర్ఎస్ నేతలు భవిష్యత్లో బిజెపితో అవగాహన కుదుర్చుకున్నా ఆశ్చర్య పోని పరిస్థితులు తెలంగాణాలో ఏర్పడుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం నుంచి అధికార పార్టీ వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

ఒక్కసారిగా మారిన రాజకీయ పరిస్థితి…
ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా బిజెపితో రాజకీయంగా కఠినంగానే వ్యవహరించిన టిఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా ఎంఐఎంతో కలిసి వెళ్లేందుకే మొగ్గు చూపింది. బిజెపికి దూరంగా ఉండడంతో ఎంఐఎం కూడా గులాబి పార్టీకి దగ్గరగా అడుగులు వేసింది.  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టిఆర్ఎస్, ఎంఐఎంలు అవగాహనతో పోటీ చేస్తాయనే సంకేతాలను ఇరు పార్టీలు ఇచ్చాయి. కాని ఒక్క సారిగా రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి.

కేంద్రాన్ని పూర్తిస్థాయిలో సమర్థిస్తున్న గులాబీ పార్టీ నేతలు…
తాజాగా గులాబి పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని  పూర్తి స్థాయిలో సమర్ధిస్తున్నారు. కేంద్రంపై పోరాడి తెలంగాణా హక్కులు సాధిస్తామన్న టిఆర్ఎస్ నేతలు, ఇప్పుడు తాము ఇస్తున్న సూచనలను కేంద్రం ఏకీభవిస్తుందనే ప్రకటనలు చేశారు. ప్రణాళిక సంఘం వ్యవహారంలో కేసీఆర్ ఇచ్చిన సూచనలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు  ప్రధాని మోడీ వెల్లడిస్తారని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అంటున్నారు.

కాంగ్రెస్‌ను దెబ్బతీయడమే లక్ష్యం…
టిఆర్ఎస్ బీజేపీకి దగ్గరవ్వడమంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ను దెబ్బతీయడం లక్ష్యంగా కనిపిస్తోంది. తెలంగాణా రాష్ట్ర సమితి వ్యవహారం రాష్ట్రంలోని  ప్రధాన రాజకీయ పార్టీలపై  ప్రభావం చూపేలా ఉంది. బిజెపి, టిఆర్ఎస్ ఒక్కటయితే రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఎవరికి వారే ఒంటరిగా రంగంలోకి దిగినా ఆశ్యర్య పోవాల్సిన అవసరం లేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.