కథ కంచికి… ఖర్చు కోట్లకి…

bahubali-exclusice-sketches2B1

లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి తన మార్కు సినిమా బాహుబలితో మరో సంచలనం సృష్టించారు. విజువల్ వండర్ గా ఇప్పటికే రివ్యూలు ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ హై రేంజిలో ఉన్నాయని ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలుగు సినిమాను కొత్త లెవెల్ కు తీసుకుపోయిన దర్శకుడిగా ఆయన ఫుల్ మార్కులు సాధించారు. వంద కోట్లు దాటిన బడ్జెట్ తో తీసిన సినిమాలో విజువల్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుందని ఊహించిన వారికి పూర్తి న్యాయం జరిగింది. సినిమాలో్ని కొన్ని సీన్లు చూసేటప్పుడు హాలీవుడ్ మూవీ చూసిన అనుభూతి పొందారు.

అయితే, ఎంత జక్కన్న అయినా తెలుగు సినిమా దర్శకుడే కదా. ఈ పరిశ్రమలోని కొన్ని వాసనలు అంత త్వరగా ఎలా పోతాయి? గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాకు ఓ జాడ్యం పట్టుకుంది. కథను వదిలేసి టేకింగ్, భారీ బడ్జెట్, కాంబినేషన్స్, విజువల్ ఎఫెక్ట్ ను నమ్ముకుని సినిమా తీయడం అనేది చాలా మందికి అలవాటుగా మారింది. ఇలా చేసి చేతులు కాల్చుకున్న వారే ఎక్కువ. తెలుగు సినిమాల్లో కొత్త కథ, కొత్త కోణంలోని కథ ఆశించడం అత్యాశే అనే పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడో ఓ సినిమా మంచి కథతో తళుక్కున మెరుస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఎప్పటికో.

సినిమా భాషలోనే, డైలాగు రూపంలో చెప్పాలంటే…. పువ్వుకు పరిమళమే అందం. అలా కాకుండా ప్లాస్టిక్ పువ్వు మీద సెంటు చల్లితే ఎలా ఉంటుంది? కథా బలం లేని తెలుగు సినిమాలూ అలాగే ఉంటున్నాయి. హంగులుంటాయి. ఆర్భాటాలుంటాయి. స్టార్లుంటారు. అందాలు ఆరబోసే హీరోయిన్లుంటారు. భారీ బడ్జెట్ ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ, కథే… ఉండీ లేనట్టుగా ఉంటుంది.

బాహుబలి విషయంలో్నూ అదే జరిగింది. చాలా చాలా రొటీన్ కథ. తర్వాతి సీన్ ఊహించడం ప్రేక్షకులకు ఏమంత కష్టం కాదు. ఇలాంటి కథాంశంతో జానపదంలోనే కాదు, సాంఘిక రూపంలోనూ తెలుగులో అనేక సినిమాలు వచ్చాయి. కథలో కొత్తదనం లేని లోటును భారీ బడ్జెట్ తో కవర్ చేశారు. టేకింగ్, విజువల్ ఎఫెక్ట్ తో పని పూర్తి చేశారు. ఉన్న కాస్త కథ కూడా ఇంటర్వెల్ వరకూ ఎక్కడో దాక్కుంటుంది. ఆ తర్వాతే తెరమీదికి వస్తుంది. సరే, కాస్త ఊహించని మలుపులతో సాగుతుంది, రిచ్ లుక్ ఉన్న గ్రాఫిక్స్ తో పాటు ఓ మంచి సినిమాను చూసి పోవచ్చు అనుకునే లోపే హటాత్తుగా సినిమా అయిపోతుంది.

సీక్వెల్ కోసం మొదటి భాగాన్ని అసంబద్ధంగా ముగించి ప్రేక్షకులను నిరాశ పరిచారు. అయినా సరే, ఇది తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ సినిమా అనే ప్రశంసలు రావడానికి కారణం…. భారీ బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్. వంద కోట్ల బడ్జెట్ కు ఆమాత్రం క్వాలిటీ ఉండదా అని కామెంట్ చేసిన వారూ ఉన్నారు. అదీ నిజమే కావచ్చు. కానీ, దర్శకుడు రాజమౌళి కాబట్టే బాహుబలి ఓ విజువల్ మాస్టర్ పీస్ గా ప్రేక్షకులకు కనువిందు చేస్తోందనేది అంతటా వినిపిస్తున్న టాక్. కథమీద కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే, నిజంగా నూటికి నూరు మార్కులు వేయదగ్గ, ఆల్ టైమ్ తెలుగు గ్రేటెస్ట్ మూవీని చూసిన థ్రిల్ ప్రేక్షకులకు దక్కి ఉండేది. అది మాత్రం మిస్సయింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *