కడియం శ్రీహరి చొరవ, మంత్రి కేటిఆర్ హామీతో పునరుద్ధరణ బాటలో బిల్ట్ కంపెనీ

బిల్ట్ కంపెనీ పునరుద్ధరణకు అంగీకారం

వారం రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వాలన్న ప్రభుత్వం

ప్రతిపాదనల మేరకు రాయితీ కల్పించేందుకు సంసిద్ధత

ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్దరణ లక్ష్యంతో ముందుకొచ్చిన ప్రభుత్వం

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చొరవతో మంత్రి కేటిఆర్ హామీతో పునరుద్ధరణ బాటలో బిల్ట్ కంపెనీ

కార్మిక పక్షపాతిగా ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణలో తెలంగాణ ప్రభుత్వం

ప్రభుత్వాన్ని కొనియాడిన కంపెనీ ప్రతినిధులు, సంతోషంలో కార్మికులు…ఉప ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు

హైదరాబాద్, జూలై 25 : తెలంగాణలో ఖాయిల పడిన పరిశ్రమ మరొకటి పునరుద్ధరణకు సిద్ధమవుతోంది. ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించి అక్కడి కార్మికులను ఆదుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(బిల్ట్) కంపెనీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు నేడు సమావేశమయ్యారు. ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించి, ఆ కంపెనీల కార్మికులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం తన పూర్తి సాయసహకారాలు అందిస్తుందని కంపెనీ ప్రతినిధులకు ఉప ముఖ్యమంత్రి కడియం, పరిశ్రమల మంత్రి కేటిఆర్ హామీ ఇచ్చారు. భూపాలపల్లి జిల్లా కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ(బిల్ట్) పునరుద్ధరణ కోసం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గత ఏడు నెలలుగా ఆ కంపెనీ యాజమాన్యం, ప్రతినిధులు, కంపెనీ కార్మికులతో చర్చలు జరుపుతున్నారు. కార్మిక శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, జిల్లా మంత్రి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాం నాయక్, కార్మిక శాఖ అధికారులు, కార్మిక సంఘాల నేతలతో రెండేళ్ల నుంచి పలు సమావేశాలు పెట్టి కమలాపూర్ రేయాన్స్ కంపెనీని పునరుద్ధరించాలని యాజమాన్యాన్ని, పునరుద్ధరణకు సహకరించాలని కార్మికులను కోరుతున్నారు. ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విజ్ణప్తి మేరకు కంపెనీ యాజమాన్యం, ప్రతినిధులు నేడు పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ వద్ద కంపెనీ పునరుద్ధరణకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం తరపున కొన్ని రాయితీలు, సహకారం కావాలని కోరారు. దీనికి పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ అంగీకరించారు. వారం రోజుల్లో కంపెనీ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో తెలిపే ప్రతిపాదనలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ అడిగారు. ప్రతిపాదనలు సమర్పించగానే ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి ఏమేమి చెయ్యగలమో చెబుతామని తెలిపారు. ఈ ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని, కార్మికుల బతుకులు బాగు చేయడం కోసం ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్ధరించే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తుందని చెప్పారు. భూపాలపల్లిలో ఈ పరిశ్రమ పునరుద్ధరణ జరిగితే అక్కడ పనిచేస్తున్న కార్మికులతో పాటు కొత్తవారికి కూడా ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని, ఇందుకోసం ప్రభుత్వం తన సాయశక్తులా కంపెనీ పునరుద్ధరణకు సాయం అందిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరపునుంచి కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీ(బిల్ట్) పునరుద్ధరణకు హామీ రావడంతో కంపెనీ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో తాము కచ్చితంగా కంపెనీ పునరుద్ధరించేందుకు ప్రయత్నాల్లో ఉన్నామన్నారు. వారం, పది రోజుల్లో కంపెనీ పునరుద్ధరణపై తమ ప్రతిపాదనలు సమర్పిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కంపెనీ పునరుద్ధరణకు చొరవ తీసుకోవడం, నేడు కంపెనీ కూడా దీనికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఒడితెల సతీష్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, కంపెనీ డైరెక్టర్ హరిహరన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *