కంది కొనుగోళ్లపై మంత్రి హరీశ్ రావు సమీక్ష.

-90 కొనుగోలు కేంద్రాలు.
-ఏడున్నర లక్షల క్వింటాళ్ల కంది కొనుగోళ్ళు .
-దేశ చరిత్రలో సరికొత్త రికార్డు .
-220 కోట్లు చెల్లింపు .-వారంలోగా బ్యాలెన్స్ చెల్లింపులకు ఆదేశం .
-ఇతర రాష్ట్రాలలోనూ కంది అధిక దిగుబడి.
-కంది రైతుల కోసం కొనసాగుతున్న కాల్ సెంటర్ .

చిట్ట చివరి గింజ వరకు కంది కొనుగోలు చేయాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. మంగళవారంఆయన కంది క్రయ విక్రయాలను , వ్యవసాయ మార్కెట్లలో తాజా పరిస్థితిని సమీక్షించారు.కంది కొనుగోలు కోసం 90 కేంద్రాలు ఏర్పాటు చేయడం, వీటి ద్వారా 7 లక్షల 48 వేల 213 క్వింటాళ్లను కొనుగోలు చేయడం దేశంలోనే రికార్డు అని మంత్రి అన్నారు. చరిత్రలో మునుపెన్నడూ ఇలాంటి ఉదంతం లేదన్నారు. ఇప్పటివరకు మార్క్ఫడ్ ఆధ్వర్యంలో 'NAFED' సంస్థ 4,94,490 క్వింటాళ్ల కంది కొనుగోలు చేసినట్టు ,ఎఫ్.సి.ఐ 2,53,723 క్వింటాళ్ల కంది కొనుగోలు చేసినట్టు మార్కెటింగు అధికారులు మంత్రికి తెలిపారు. 377 కోట్ల 85 లక్షల విలువైన కంది పంటను వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేసినట్టు వివరించారు. ఇందులో 220 చెల్లింపులు జరిగాయని, మరో నాలుగైదు రోజుల్లో మిగతా 150 కోట్లు చెల్లింపులు జరిగేల చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఖాళీ గోనె సంచుల కొరత ఏర్పడడంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి.ఆనంద్ తో మాట్లాడి 6 లక్షల ఖాళీ గోనెసంచులను 24 గంటలలోపు NAFED కు సమకూర్చిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు 2. 47 లక్షల హెక్టార్ల కంది సాగు జరిగేదని ఇప్పుడు 4 లక్షల 35 హెక్టార్ల కు కంది సాగు పెరిగిందని మంత్రి గుర్తు చేశారు.కంది సాగు విస్తీర్ణం ఎక్కువ కావడం కూడా కంది రైతు ఆశించి గిట్టుబాటు ధర లభించడంలేదన్నారు. అయితే కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు.
కంది తదితర పంటల మార్కెట్ ధరలను కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ నేరుగా రంగంలో దిగి 90 కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కంది పండించిన రైతుకు గరిష్ట ధర రావడం లేదన్నారు.ఎగుమతి, దిగుమతులకు సంబంధించి మొజాంబిక్, టాంజానియా, మాల్వాయి, మయన్మార్ తదితర ఆఫ్రికా దేశాలతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం తెలంగాణ కంది రైతులకు నష్టం కలిగిస్తున్నదన్నారు. 2016-17 లో లక్ష టన్నులు , మరో మూడేళ్లలో 2 లక్షల టన్నుల కంది ని దిగుమతి ని చేసుకోవడాకి కేంద్రం ఎంఓయు చేసుకోవడంతో ఈ సమస్యలు తలెత్తాయన్నారు. శనగలు మినహా మిగతా పప్పు ధాన్యాల ఎగుమతి ని కేంద్ర ప్రభుత్వ 2006 ఎగుమతి విధానం లో భాగంగా నిషేధించడం కూడా ఇక్కడ కంది రైతు ప్రయోజనాలకు భంగం కల్గిస్తున్నట్లు చెప్పారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం ఇతర దేశాల దిగుమతులపై కనీసం 30 శాతం సుంకం విధించవలసి ఉండగా కేంద్ర ప్రభుత్వం పప్పు ధాన్యాల దిగుమతులపై ఆ సుంకాన్నిఎత్తివేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను పునహ్ సమీక్షించుకోవాలని, దిగుమతులపై సుంకాన్నిపెంచితేనే దేశంలోని రైతులకు మంచి ధర లభిస్తుందంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్‌ కు తాను ఇదివరకే లేఖ రాసినట్టు మంత్రి తెలియజేశారు. పప్పుధాన్యాల ఎగుమతి విధానాన్ని సులభతరం చేయాలని ఆయన మరోసారి కేంధాన్ని కోరారు. కంది తదితర పప్పు ధాన్యాల ధరలు పెరిగిన సందర్భాలలో నిల్వలపై ఆంక్షలు ఉండేవని వాటిని ఎత్తివేయాలని కేంద్రాన్నిమంత్రి మరోసారి కోరారు.
మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలలో ఈసారి భారీగా కంది దిగుబడులు వచ్చినందున మార్కెట్ లోకంది పంటకు ధర తగ్గినట్టు మంత్రి విశ్లేషించారు. కంది రైతుల సమస్యలు, ఫిర్యాదుల కోసం జనవరి 21న ప్రారంభించిన కాల్‌ సెంటర్ పనితీరును మంత్రి హరీశ్ రావు సమీక్షించారు. ఇప్పటివరకు 305 కు పైగా ఫిర్యాదులు అందినట్టు మార్కెటింగు అధికారులు చెప్పారు.ఆయా ఫిర్యాదులపై ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకోవాలి అని మంత్రి ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *