ఔటర్ టెర్రర్

హైదరాబాద్: జౌటర్ రక్తసిక్తమవుతోంది.. జంటనగరాలకు మెడలో మణిహారంలా ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్..నిత్యం ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది..రోజు రోజుకు పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య చూస్తే ఔటర్ ఎక్కితే గమ్యస్థానానికి చేరుకుంటామో..లేదోనని వాహనదారులకు దడపుడుతోంది…అంతేకాదు కోట్లకు కోట్లు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఔటర్ కి అసలు రోడ్డు భద్రతా ప్రమాణాల్ని సూచించడంలో పాటించడంలో అధికార యంత్రాంగం ఫెయిలయిందనే చెప్పాలి. నిత్యం రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఔటర్ సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో రక్తసిక్తమవుతున్న ఔటర్ రింగ్ రోడ్ ఎంతో హంగు ఆర్బాటాలతో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు.. ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ఇటీవలి కాలంలో జరుగుతున్న ప్రమాదాలతో ఈ దారులు మృత్యుఘంటికలను మోగిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనాదారులు హడలెత్తిపోతున్నారు. దీంతో సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుతామోలేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా సైనేజ్ (సూచిక బోర్డు)ను చూసి వాహనదారుడు స్పందించేందుకు కనీసం 2.5 సెకన్లు పడుతుంది. బోర్డును చూసిన వాహనాదారులకు అప్రమత్తమయ్యేందుకు ఈ సమయం అవసరం. అలాంటిది వాహనదారుడు ఎక్సలేటర్ డౌన్ చేయాలన్నా.. బ్రేకు వేయాలన్నా.. మరిన్ని సెకన్లు కావాలి. అందువలన సైనేజెస్ ఈ శాస్త్రీయ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాగా వేగవంతమైన ప్రయాణం.. మహానగర రహదారులపై భారీ వాహనాల రాకపోకల ప్రభావం పడకుండా నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుపై సైనేజ్‌ ల ఏర్పాటులో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గంటకు 120 కి.మీ. వేగ పరిమితితో నిర్మించిన ఔటర్‌ పై సూచికాబోర్డు చూసి అప్రమత్తమయ్యే సరికే.. వాహనం 150 నుంచి 200 మీటర్లు ముందుకు వెళ్లిపోతుంది. ఫలితంగా అయోమయానికి గురవుతున్న వాహనదారులు వేగంగా వెళ్తున్నామన్న విషయాన్ని విస్మరించి అకస్మాత్తుగా వెహికిల్‌ ను టర్న్ చేస్తున్నారు. దీంతో అదుపు తప్పి ప్రమాదాల బారినపడుతున్నారు. నిబంధనలు పాటించక పోవడమూ ప్రమాదాలకు మరో కారణం. నగర, రాష్ట్ర రహదారులపై అడ్డదిడ్డంగా వెళ్లే వాహనదారులు ఔటర్‌ పైనా అదే విధంగా వెళ్తున్నారు. అందుకే ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఔటర్‌ పై అదే స్థాయిలో నిబంధనల అమలు మాత్రం జరగడం లేదు. శాస్త్రీయ విధానంలో ఉండాల్సిన సైనేజెస్ నుంచి.. వేగ నిర్ధారణ, సీసీ కెమెరాల పరికరాల ఏర్పాటు, నిబంధనల అమలులో అధికారులు చూపుతోన్న అశ్రద్ధ వాహనదారుల పాలిట మరణశాసనంలా మారుతోంది. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద సర్వీస్ రోడ్లు, ఔటర్ మార్గానికి అనుసంధానం సరిగా లేకపోవడంతో ఓఆర్‌ర్‌పైకి అకస్మాత్తుగా వాహనాలు వస్తున్నాయి. దీంతో అప్పటికే ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనంతో ఒకదానికొకటి ఢీకొట్టే అవకాశం ఉంది. ప్రమాదాలు జరిగిన ప్రతీసారి వేగ నియంత్రణకు చర్యలు తీసుకుంటామంటున్న అధికారుల ప్రకటనలు ఆచరణకు నోచుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పెద్దంబర్ పేట్ ఔటర్ రింగ్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వరంగల్ జిల్లాకు చెందిన శివకృష్ణ (పరకాల), శశిధర్ (బెల్లంపల్లి), రాజు (వరంగల్, నరసకపల్లి) శ్రీకాంత్ (పరకల) నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఇక ఘటన మరుకముందే తాజాగా శామీర్‌పేట మండలం దొంగలమైసమ్మ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సాధారణ రహదారుల కంటే.. వేగంగా వెళ్లేందుకు అనువుగా నిర్మించిన మార్గాల్లో ట్రాఫిక్ నిబంధనల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. వేగ పరిమితి నుంచి.. ఎగ్జిట్, ఎంట్రీ, వేగ పరిమితి, జరిమానా విధింపు వరకు వివిధ వివరాలు తెలిపే సైనేజెస్‌ను ఏర్పాటు చేయాలి. ఔటర్‌పై వాహనాలు వేగంగా వెళ్లే అవకాశం ఉన్న దృష్ట్యా కొన్ని కిలోమీటర్ల ముందు.. తరువాత వచ్చే ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్లు,జంక్షన్ల వివరాల సమాచారంతో కూడిన బోర్డులు ఉండాలి. ఇలా తగిన జాగ్రతలు తీసుకునప్పుడే రోడ్డు ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉంటుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.