ఓట‌ర్ల జాబితా పై మూడు రోజులు విస్తృత ఇంటింటి స‌ర్వే – క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్‌

రానున్న మూడు రోజుల్లో నగ‌రంలో అత్యధిక ఓట‌ర్లు న‌మోదు అయిన ఇళ్ల‌ను, ఫోటోలు లేని ఓట‌ర్లను, ఓట‌ర్లుగా ఉండి ఇల్లు లేనివారిని గుర్తించి ఆయా ఓట్ల‌ను తిరిగి విచారించ‌నున్న‌ట్లు హైద‌రాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ దానకిషోర్ వెల్ల‌డించారు. హైద‌రాబాద్ జిల్లా ఓట‌రు న‌మోదు అధికారులు, స‌హాయ ఓట‌రు న‌మోదు అధికారులతో దాన‌కిషోర్ నేడు సాయంత్రం స‌మావేశం నిర్వ‌హించారు. కంటోన్మెంట్ సి.ఇ.ఓ చంద్ర‌శేక‌ర్, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ కెన‌డిలు పాల్గొన్న ఈ స‌మావేశంలో దాన‌కిషోర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు అభ్యంత‌రాలు, క్లేయిమ్‌ల‌ను స్వీక‌రిస్తున్నామ‌ని, దీనికిగాను ప్ర‌తి పోలింగ్ లొకేష‌న్‌లో బి.ఎల్‌.ఓలు హాజ‌ర‌య్యేవిధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నెల 22,23,24,25 తేదీల్లో క్లేయిమ్‌లు, అభ్యంత‌రాలు అధికంగా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, ఈ లోగా ఓట‌ర్ల జాబితాలో ఒకే ఇంటిలో అధికంగా ఓట‌ర్లు ఉన్నవారిని మ‌రోసారి ప‌రిశీలించాల‌ని కోరారు. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌కుగాను ప్ర‌తి ఏడు పోలింగ్ బూత్‌ల‌కు ప్ర‌త్యేకంగా ఒక ప‌ర్య‌వేక్ష‌క అధికారిని నియ‌మించామ‌ని, వీరు 15,16,17 తేదీల్లో ప్ర‌ముఖుల ఓట‌ర్ల పై ఇంటింటి స‌ర్వేను నిర్వ‌హించాల‌ని సూచించారు. ఓట‌ర్ల న‌మోదు, స‌వ‌ర‌ణ‌ల‌పై ఈ నెల 15, 16 తేదీల్లో వార్డు, బ‌స్తీ, కాల‌నీ సంక్షేమ సంఘాల స‌మావేశాలు ప్ర‌త్యేకంగా నిర్వ‌హిస్తున్నామ‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్ర‌తిఒక్క‌రూ విధిగా ఓట‌రు న‌మోదు చేసుకునేలా ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపించాల‌ని దాన‌కిషోర్ ఆదేశించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నిక‌ల విధుల‌కు గైర్హాజ‌రైన బి.ఎల్‌.ఓలను గుర్తించి వెంట‌నే గుర్తించి వారిపై ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం 1952 సెక్ష‌న్ 32 ప్ర‌కారం చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఎన్నిక‌ల అధికారుల‌కు సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *