
నగరంలో 18 ఏళ్లు నిండిన యువ ఓటర్లను నమోదు చేయించడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను జీహెచ్ఎంసీ సద్వినియోగపర్చుకుంటోంది. తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందిన కళాకారుడైన బిత్తిరి సత్తి హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్‌ను ఓటర్ల జాబితా సవరణ, నమోదు తదితర అంశాలపై చేసిన ప్రత్యేక కార్యక్రమాన్ని దాదాపు 3లక్షలకు పైగా వీక్షించారు. దీంతో పాటు ఓ ప్రైవేట్ ఛానల్‌లో ప్రసారం అయ్యే బిగ్‌బాస్ ప్రోగ్రాంలో ప్రముఖ సినీ నటుడు, కార్యక్రమం నిర్వాహకుడు అయిన నాని 01-01-2018 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఈ నెల 25వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని చేసిన ప్రకటనను దేశవ్యాప్తంగా లక్షలాది మందికి చేరింది. ఆదివారం నాడు ఉదయం మొట్టమొదటి సారిగా నక్లెస్‌రోడ్‌లో వందలాది మంది మహిళా బైకర్లచే ఓటరు నమోదు చైతన్యంపై నిర్వహించిన ర్యాలీ హైదరాబాద్ నగరవాసులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. కొన్ని వార్తా ఛానళ్లలో, రేడియోలలో ఓటరు నమోదుపై జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ ముఖాముఖి కార్యక్రమాలను కూడా నిర్వహిచారు. యువత ఓటరుగా నమోదు చేసుకున్న అనంతరం ప్రత్యేకంగా ఫోటో దిగడానికిగాను ప్రత్యేకంగా స్టాండీలను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అతిపెద్ద వినాయుకుడైన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద కూడా 18ఏళ్లు నిండినవారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సందేశంతో నేడు చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు. వీటికితోడు రేడియో జింగిల్స్, స్కోలింగ్‌లతో పాటు ప్రత్యేకంగా ప్రచార రథాలను కూడా ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ తెలిపారు. ఓటర్ల నమోదు, సవరణపై జీహెచ్ఎంసీలో టోల్‌ఫ్రీ నెం: 1800-599-2999 అనే 15 లైన్ల నెంబర్‌ను కూడా ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు.