
భువనేశ్వర్, ప్రతినిధి : ఈ రాజకీయ నాయకులున్నారే.. వేల కోట్లు లక్ష కోట్లు సంపాదించి.. మనవలు.. వారి మనవల్లు ఖర్చు పెట్టినా తరగని సంపాదన పోగేస్తున్నారు.. ఈ రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు ఆస్తులు కూడబెట్టుకోవాలని ఆశపడుతుంటారు…
కానీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాత్రం అలా కాదు. తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని సైతం ప్రభుత్వానికి ఇచ్చి శబాష్ అనిపించుకున్నారు. వారసత్వంగా తన తండ్రి బిజూ పట్నాయక్ నుంచి తనకు, తన అన్న ప్రేమ్ పట్నాయక్ కు వచ్చిన ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చారు. ఒడిశాలోని కటక్ లో ఉన్న తమ ఆస్తులను జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో సబ్ రిజిస్ట్రార్ సమక్షంలో ప్రభుత్వం పేరు మీద రిజిస్టర్ చేశారు.
అయితే, ఈ ఆస్తుల్లో నవీన్ పుట్టిన ఇల్లు అయిన ‘ఆనంద్ భవన్’ కూడా ఉంది. ఈ ఇల్లును మ్యుజియంగా మార్చాలని అక్కడి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ‘ఆనంద్ భవన్’ ను ప్రభుత్వానికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ప్రేమ్ పట్నాయక్ చెప్పారు. 1997లో తన తండ్రి చనిపోవడంతో నవీన్ రాజకీయాల్లోకి వచ్చారు. ఎప్పుడూ తెల్లటి లాల్చీ పైజమాతో కనిపిస్తారు నవీన్ మనసు కూడా అంత నిర్మలంగానే ఉంటుందనే పేరు తెచ్చుకున్నారు. 68 ఏళ్ళ నవీన్ పట్నాయక్ బ్రహ్మచారి.