
హైదరాబాద్, ప్రతినిధి : నగరంలో అంతర్జాతీయ ఐటీ సదస్సు జరగనుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సదస్సు.. ఈ సారి హైదరాబాద్లో జరగనుంది. ఇందుకు సంబంధించి నాస్కామ్ ప్రతినిధులు సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. 2018లో హైదారాబాద్లో నిర్వహించనున్న ప్రపంచ ఐటీ సదస్సుపై చర్చించారు.
మూడు వేల మంది ప్రతినిధులు..
ఈ సదస్సును నిర్వహించేందుకు సానుకూలంగా స్పందించిన నాస్కామ్ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది. ప్రపంచంలోని 80 దేశాల నుండి సుమారు 3వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ప్రతినిధులతో పాటు ఐటి దిగ్గజాలు, వివిధ దేశాల ప్రముఖులు కూడ హాజరుకానున్నారు. ఆసియా ఖండంలో రెండోసారి ఈ సదస్సు జరగనుంది. వివిధ దేశాలు ఈ సదస్సు నిర్వహణకు పోటీపడ్డాయి. అయితే భారత్లోనే ఈ సదస్సు నిర్వహణకు ప్రపంచ ఐటీ కాంగ్రెస్ అంగీకారం తెలిపింది.
ప్రతిష్ట పెరుగుతుందన్న మంత్రి కేటీఆర్..
ఈ సదస్సు నిర్వహణతో హైదరాబాద్ ప్రతిష్ట ప్రపంచంలో మరింత పెరిగే అవకాశం ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ రంగంలో ఎగుమతులు, పెరిగే అవకాశ ఉందన్నారు. మరోవైపు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు ప్రతి ఏటా లక్ష కోట్ల ఐటీ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. 2016లో బ్రెజిల్లో జరిగే ప్రపంచ ఐటీ సదస్సుకు రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని పంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా దేశాల్లో నిర్వహించిన సదస్సులను పరిశీలించి, వాటిని తలదన్నేరితీలో ఈ సదస్సును నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వానికి కలిసి వస్తుందా ?
ఈ సదస్సు నిర్వహణతో రాష్ట్రంలో ఐటీ రంగం రూపురేఖలు మారనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, వ్యాపారాభివృద్ధి, కొత్త ఆలోచనలు, ఉద్యోగ నాయకత్వం, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈ సదస్సు సాగనుంది. ఈ సదస్సు ఏ మేరకు ప్రభుత్వానికి కలిసివస్తోందో చూడాలి.