
శాసన సభకు జరిగే ఎన్నికలకుగాను ఓటింగ్ శాతం పెంపు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో నేడు ఓటరు చైతన్య కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 30 స్వచ్చంద సంస్థలు హాజరైన ఈ కార్యక్రమానికి దానకిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో 53శాతంలోపే పోలింగ్ నమోదు అయ్యిందని, ఈ సారి ఈ ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు పెద్ద ఎత్తున చైతన్య, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఓటింగ్‌ను పెంచడం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, దివ్యాంగుల ఓటర్లందరినీ ఓటింగ్‌లో పాల్గొనేలా చూడడం, పోలింగ్ కేంద్రాలను గుర్తించడం తదితర అంశాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగులందరూ ఓటింగ్‌లో పాల్గొనేలా చూడడానికి దేశంలోనే మొట్టమొదటి సారిగా వాదా యాప్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో 20వేల మంది ఓటరు నమోదుకు అర్హులైన దివ్యాంగులు ఉండగా వీరిలో ఇప్పటికే 16,000 మందికి ఓటు హక్కు కల్పించామని, మిగిలినవారిని కూడా ఓరుగా నమోదు చేయించడానికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లాలో దాదాపు 40లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ప్రతి వెయ్యి మందిలో 930 మంది ఓటర్లు నమోదై ఉన్నారని తెలియజేశారు. 80శాతానికిపైగా అక్షరాస్యత కలిగిన హైదరాబాద్ జిల్లాలో కేవలం 53శాతంలోపే ఓటింగ్ నమోదు అయ్యిందని, ముఖ్యంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 20శాతానికి తక్కువగా ఓటింగ్ నమోదు కావడం విచారకరమని అన్నారు.
*ఓటరు స్లిప్‌లతో పాటు పోలింగ్ కేంద్రాల మ్యాప్‌ను అందిస్తాం*
డిసెంబర్ 7వ తేదీన జరిగే పోలింగ్‌కు రెండు మూడు రోజుల ముందుగానే ఓటరు స్లిప్‌లను అందజేస్తామని, ఓటరు స్లిప్‌లతో పాటు సంబంధిత పోలింగ్ కేంద్రాల మ్యాప్‌లను కూడా అందించేందుకు చర్యలు చేపట్టామని దానకిషోర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల మ్యాప్‌ను అందజేయడం ద్వారా ఓటర్లకు మరింత సులభంగా ఉంటుందని అన్నారు. హైదరాబాద్ జిల్లాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వివిప్యాట్ల పై ఏర్పాటు చేసిన అవగాహన కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 3లక్షల మంది నగర ఓటర్లు డమ్మీ ఓటింగ్‌లో పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈవీఎం, వివిప్యాట్ల పనితీరుపై బూత్లేవల్ ఏజెంట్లు, బూత్ లేవల్ అధికారుల ఉమ్మడి సమావేశాలు నిర్వహించామని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ చేస్తున్నామని తెలిపారు.
*హైదరాబాద్‌లో రూ. 17.65 కోట్ల స్వాధీనం*
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుండి హైదరాబాద్ నగరంలో నిర్వహించిన సోదాల్లో ఇప్పటి వరకు రూ. 17.65 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. వీటిలో రూ. 16.79 కోట్లు నగదు కాగా, రూ. 45.84లక్షల విలువైన మద్యం, వెండి ఇతర వస్తువులు స్వాధీనపర్చుకున్నామని తెలియజేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమణకు సంబంధించి 30కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనుమతులకై 18 దరఖాస్తులు అందగా 16 అనుమతులు జారీచేశామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమణలపై 18 ఫిర్యాదులు అందగా 14 ఫిర్యాదులపై తగు విచారణ పూర్తిచేశామని తెలిపారు. నిస్పాక్షిక ఎన్నికల నిర్వహణ, ఓటింగ్ శాతం పెంపుకు కృషిచేస్తున్న తెలంగాణ ఎన్నికల నిఘా సంస్థకు పూర్తిస్థాయిలో సహకరించనున్నట్టు దానకిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంపొందించి ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తామని ప్రతిజ్ఞ నిర్వహించారు.