
రాజధాని నగర నిర్మాణం కోసం రైతుల భూములను తీసుకోవడం జోరుగా సాగుతోంది. నయానో భయానో ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం ఆరాట పడుతోంది. కానీ వాస్తవ పరిస్థితులను గమనిస్తే, రైతులందరూ సంతోషంగా, స్వచ్ఛందంగా భూములను ఇస్తున్నట్టు కనిపించడంలేదు. భయపడి భూములు ఇస్తున్నామని చాలా మంది రైతులు చెప్తున్నారు.
వైసీపీ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. రైతులకు అండగా ఉండాలని నిర్ణయించింది. విషయాన్ని గవర్నర్ వరకూ తీసుకు పోయింది. భూములు ఇవ్వక పోతే కొట్టేలా ఉన్నారని పలువురు రైతులు వాపోతున్నారు. పంటలను తగలబెట్టిన ఘటనలతో రైతుల్లో తీవ్ర భయందోళనలు ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ఏదో ఒక విధంగా భూములను తీసుకోవాలని తాపత్రయ పడుతోంది.
పలు ప్రజా సంఘాలు కూడా బలవంతంగా భూములు లాక్కోవద్దని డిమాండ్ చేస్తున్నాయి. హైదరాబాదులో బుధవారం జరిగిన సమావేశంలోనూ రైతులకు భరోసానిచ్చాయి. తాము అండగా ఉంటామని చెప్పాయి. దీంతో రాజధాని భూముల సేకరణ పజావుగా సాగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే, ప్రభుత్వ విధానంపై పలు విమర్శలు వస్తున్నాయి. రాజధాని నిర్మాణం కోసం బీడు భూములు, ఉపయోగంలో లేని వాటిని వినియోగించాలని పలువురు సూచిస్తున్నారు. పచ్చని పంట పొలాలను కప్పేసి రాజధాని నిర్మాణం చేయడం సరికాదని అంటున్నారు. కేంద్రం నియమించిన కమిటీ కూడా ఇదే విషయం చెప్పింది.
అయినా చంద్రబాబు సర్కారు మాత్రం ఆరాటపడుతోంది. తుళ్లూరు ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం జరగాలనేది దాని పట్టుదల.అత్యంత సారవంతమైన భూములను ఇలా నగర నిర్మాణానికి బలి చేయడం ఏమిటని పర్యావరణ వేత్తలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు భూ సమీకరణకు వ్యతిరేకంగా ఉన్న రైతులకు పార్టీల, ప్రజా సంఘాల మద్దతు పెరుగుతోంది. దీంతో ఆ కార్యక్రమం సాఫీగా పూర్తవుతుందో లేదో చూడాలి.